‘ఇద్దరు చంద్రులు’ అని చంద్రశేఖరరావుని, చంద్రబాబుని ఒకేగాటన కట్టేయడం సబబుకాదు. తెలంగాణ ముఖ్యమంత్రి ` మిగులు బడ్జెట్ వున్న రాష్ట్ర సారధి కల్వకుంట చంద్రశేఖరరావుని కుబేరునిగా చెప్పుకోవాలి. ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు సానుకూలంగా వుంటున్నాయి అంటే కారణం ` మిగులు బడ్జెట్. ఇందుకు పూర్తి విరుద్ధం చంద్రబాబు పరిస్థితి. లోటు బడ్జెట్, పింఛన్లు జీతాలు సర్దుబాటు చేయలేని నిస్సహాయత, నిధులు రాల్చని కేంద్రం, తాత్కాలిక రాజధానిలో తన మాట వినని పోలీసు యంత్రాంగం, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి పూనుకుంటే భూసేకరణపై రాద్ధాతం చేసే ప్రతిపక్షం, పోలవరం కన్నా ముందుగా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని పూర్తిచేసి తానేమిటో రుజువు చేయడానికి ప్రయత్నిస్తుంటే మోకాలడ్డుతున్న జగన్, తాత్కాలిక రాజధానిలో పాలన సాగిద్దామంటే కలిసిరాని ఉద్యోగులు, నిర్మాణాత్మకమైన ప్రణాళికలకు ఆమోదముద్ర వేయించుకోవడానికి అసెంబ్లీని ప్రవేశపెడితే అప్రదిష్టపాల్జేసిన సభ్యుల ప్రసంగాలు అయినా ఆత్మ విశ్వాసం కోల్పోక, జాతి భవితకోసం అవమానాలు దిగమింగుతూ అడ్డొచ్చిన సైంధవుడ్ని అడ్డతీగల పాల్జేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్న తీరు ఓ ఆధునిక ‘కుచేలోపాఖ్యానం’. కుబేరుడు కల్వకుంట చంద్రశేఖరరావు దూకుడు, సైంధవుడు జగన్ సృష్టిస్తున్న అలజడి, కేంద్రం కల్పిస్తున్న ఆర్ధిక ఒత్తిళ్ళు ఆలోచనాపరులయిన ఆంధ్రుల అభిమానానికి దగ్గరచేస్తోంది చంద్రబాబుని. ప్రజా ‘బలం’ ముందు ‘ధన’ బలం ఎంత అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.