ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ సోదరులు చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తున్నారు. బహిరంగంగానే పార్టీ అధినేతపై విమర్శలు చేయడం, పార్టీ గురించి వాస్తవాలు మాట్లాడుతుండటంతో వీరిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక బాబు సతమతమవుతున్నట్లు తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. ఇక తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన పని రెండు జిల్లాల మధ్య వార్‌కు దారి తీసింది. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం సింగవరం వద్ద పులివెందుల కాల్వకు జేసీ గండికొట్టడం, అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఆ తర్వాత కడప జిల్లా రైతులు వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అయితే కాల్వకు గండికొట్టిన సమాచారాన్ని సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడికి అధికారులు తెలియజేశారు. దీంతో ఈ చర్య ప్రాంతీయ విభేదాలకు కారణమవుతుందని బాబు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తాను సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు తిరిగిరాగానే వచ్చి కలుసుకోవాలని చంద్రబాబు జేసీ సోదరులకు వర్తమానం పంపినట్లు తెలిసింది. ఇక తనను కలిసిన తర్వాత జేసీ సోదరులకు బాబు ఎలాంటి క్లాసు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.