ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలతోపాటు విద్యారంగానికి కూడా అన్ని ప్రభుత్వాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకే ప్రాధాన్యతనిచ్చాయి. ఈక్రమంలో ఇక్కడ పలు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు వెలిశాయి. వీటిలో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు కూడా ఉన్నాయి. గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉండటంతో అన్ని ప్రాంతాల ప్రజలకు ఇక్కడ చదువుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇప్పుడు ఏపీ విద్యార్థులకు ఇక్కడ చదువుకునే వెసులుబాటు తక్కువే. ఇక తెలంగాణలో నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నాన్‌లోకల్ కేటగిరీ కింద భారీ ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. తెలంగాణేతర రాష్ట్రాల నుంచి మొత్తం 21 వేల దరఖాస్తులు రాగా వీటిలో కేవలం ఏపీ విద్యార్థుల నుంచే 14500 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇంకా ఏప్రిల్ 9 వరకు తెలంగాణలో నిర్వహించే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆలోగా ఈ సంఖ్య కనీసం మూడింతలవుతుందని అధికారవర్గాల అంచనా. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో రాయలసీమ నుంచి 6 వేలు, కోస్తాంధ్ర నుంచి 8500 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.