తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేయడానికి వారిద్దరూ కలిసి కష్టపడి పనిచేశారు. ఒకరు రాజకీయ జేఏసీ అధ్యక్షుడిగా అన్ని వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురాగా మరొకరు తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వారిద్దరూ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా స్థిరపడగా.. కోదండరాం మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడే సమయంలోనే వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. అవి రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయకపోతే మరో ఉద్యమం తప్పదంటూ కేసీఆర్‌ను కోదండరాం హెచ్చెరించారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వకపోవడం ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఉద్యోగాల కోసం విద్యార్థులు చేసే ఉద్యమానికి తాను సారథ్యం వహిస్తానని కోదండరాం చెప్పకనే చెబుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా పలుమార్లు విద్యార్థులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరాం పలుమార్లు ప్రకటనలిచ్చారు. ఈ ఉద్యోగాల ఆందోళన కేసీఆర్, కోదండరాంల మద్య ప్రత్యక్ష యుద్ధానికి దారి తీయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.