మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత వివాదానికి కారణమవుతున్నాయి. ఈ ఎన్నికలు ఇండస్ట్రీని రెండువర్గాలుగా చీల్చింది. 'మా' అధ్యక్ష బరిలో ఉన్న రాజేంద్రప్రసాద్, జయసుధలు ఎవరికి వారే ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియపై ఇదివరకే రాజేంద్రప్రసాద్ వర్గీయులు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఏప్రిల్ 7వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియో ఫుటేజీని సమర్పించాలని, అప్పటి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించవద్దని స్పష్టం చేసింది. గతంలోనే రాజేంద్రప్రసాద్ వర్గీయులు కోర్టుకు వెళ్లగా ఎన్నికలు జరుపుకోవచ్చని, అయితే తమ ఆదేశాలు అందేవరకూ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించవద్దని కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్, జయసుధల మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో విజయం ఎవరిదో తేలాలంటే మరో వారం రోజులపాటు వేచిచూడాల్సిందే.