సింగపూర్ జాతిపిత అందించిన బాటన్‌ని మోదీ, చంద్రబాబు అందుకోవాలి
సింగపూర్ - తెలుగు వారికి సుపరిచితమయిన పేరు.
అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ‘రోల్ మోడల్’ సిటీ.
రేపటి తరం గురించి తపించిన వ్యక్తి; కలలుగన్న వ్యక్తి; కలల్ని సాకారం చేసిన వ్యక్తి : సింగపూర్ జాతిపిత, తొలి ప్రధాని లీ క్వాన్ యూ.
ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికాని తోసి రాజని, ప్రపంచాధిపత్యం సాధిస్తున్న చైనాకు వృద్ధిరేటులో చెక్‌పెడుతూ సముద్ర జలాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాని సంఘటితంగా సవాలుచేస్తూ వడివడిగా దూసుకుపోతున్న మోదీకి సింగపూర్ జాతిపిత ఆదర్శం; ఆయన ఆలోచనలు ఆచరనీయం; ఆయన తీసుకున్న కఠోర నిర్ణయాలు అధ్యయనీయం.
చంద్రబాబుకి చోదక శక్తిగా ఆవిర్భవించిన ‘లీ క్వాన్ యూ’ తన 91వ ఏట మార్చి 23న కన్నుమూశారు. కేవలం ఒకే ఒక తరంలో ఒక జాతి ఆసియాలో ప్రత్యేకించి అగ్నేయాసియాలో ఎవరూ అందుకోలేనంత స్థాయికి ఎదగడానికి కారణం : లీ దార్శనికత.
ప్రపంచంలో భారత్ నెం.1 గా నిలవాలని మోదీ, సింగపూర్ వలె నవ్యాంధ్ర రాజధాని వెలిగిపోవాలని చంద్రబాబు కలలు కంటున్నారు.
నాయకుల కలలు కార్యరూపం దాల్చాలంటే ప్రజలు తమ సుఖాలను కొంత త్యాగం చేయాలి, విశ్రాంతి సమయాలను తగ్గించుకొని కష్టపడాలి, తాను పనిచేయడం కాదు తోటివారు పనిచేసేలా చూడాలి, అన్నిటినీ మించి దేశాన్ని ప్రేమించాలి. పన్నులు సకాలంలో సవ్యంగా చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అన్నిటినీ మించి ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించడం మానేయాలి. వాగ్దానాలు అమలుచేయని నాయకులను తదుపరి ఎన్నికలలో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి.
- ఇదే సింగపూర్ జాతి పితకు మనం సమర్పించే ఘన నివాళి.