ప్రస్తుతం యూనివర్సిటీలకు చాన్స్‌లర్లను నియమించే అధికారం గవర్నర్ చేతుల్లో ఉంది. అయితే ఈ అధికారాన్ని గవర్నర్ నుంచి తొలగించి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకురావాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. గతంలో ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విద్యాశాఖమంత్రిగా రాజనర్సింహ ఉన్నారు. వీసీల నియామకానికి సంబంధించి వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనిప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదిస్తుంది. ఆ ముగ్గురిలో ఒకర్ని గవర్నర్ యూనివర్సిటీ వీసీగా నియమిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఆరు యూనివర్సిటీలకు వీసీలను నియమించాల్సి ఉంది. ఈ అధికారం గవర్నర్ చేతిలో ఉండటం తమకు ప్రతిబంధకం అని ఆలోచించిన కేసీఆర్ వీసీల నియమాకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటూ చట్టానికి సవరణ చేయనున్నట్లు సమాచారం.