ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దేశవ్యాప్తంగా దాదాపు 8.80 కోట్ల మంది ఈ పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో ఈ రికార్డు నమోదయ్యింది. చైనాలోని కమ్యూనిస్టు పార్టీ 8 కోట్ల మంది సభ్యులతో ప్రథమ స్థానంలో ఉండేది. అయితే ఈసారి సభ్యత్వ నమోదును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వీలైనంత మందిని పార్టీలో చేర్చుకోవడానికి కృషి చేసింది. ఆన్‌లైన్ ద్వారా, ఫోన్ ద్వారా కూడా బీజేపీ సభ్యత్వాన్ని తీసుకునే అవకాశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ పార్టీలో చేరారు. ఆఖరి కోటి మంది కేవలం 8 రోజుల వ్యవధిలోనే పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ ఊపుతో 2017లో ఆ రాష్ట్ల్రంలో జరిగే ఎన్నికల్లో సొంతంగానే అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసే వరకూ బీజేపీలో చేరే వారి సంఖ్య పది కోట్లకు చేరుకుంటుందని అంచనా.