పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోలయిన మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ తదితరులు ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గతంలో 'మా' ఎన్నికల గురించి ఎవరు పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం పోటి చేస్తున్న అభ్యర్ధులు మీడియాకు ఎక్కి రచ్చ చేయడం, పరస్పర ఆరోపణలతో 'మా'కు విస్తృత ప్రచారం కల్పించారు. ఈ నేపధ్యంలో ప్రజలు వీటిపై దృష్టి సారించారు. పరిశ్రమలో మహా మహులు, అగ్ర హీరోలు ఎన్నికకు గైర్హాజరు కావడం ఆశ్చర్యం కలిగించింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవిలకు ఎన్నికల ఆవశ్యకత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సామాన్య ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వీరు తోటి కళాకారుల సమస్యలపై స్పందించాల్సిన అవసరం లేదా..? కనీసం ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలకు మంచి సందేశం ఇస్తే బాగుండేది. నాగబాబు తప్పిస్తే.. మెగా కుటుంబంలో ఒక్క హీరో కూడా 'మా' ఎన్నికలకు హాజరుకాలేదు. మెగా హీరోల మౌనం వెనుక కారణం ఏంటో తెలియడం లేదు.