మన్మధ నామ సంవత్సరంలో తెలుగు సినిమాల్లో మహిళకు పట్టాభిషేకం జరగబోతుంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో కథానాయిక పరిస్థితి కరివేపాకు చందంగా తయారయింది. సినిమాలో ఓ అందాల భామ ఉంటుంది. కేవలం పాటలకు, కథానాయకుడితో కాసేపు రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతుంది. ప్రేక్షకులు కూడా వారిని అటువంటి పాత్రలలో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మధ్యలో 'అలా మొదలైంది', 'మళ్లీ మళ్లీ ఇది రాని రొజు' సినిమాల్లో నిత్య మేనన్.. 'ఏం మాయ చేశావే', 'మనం' సినిమాల్లో సమంత ఇలా కొందరికి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలైతే చాలా అరుదు. ఒకవేళ అలాంటి సినిమాలు వస్తే.. పురుషాధిక్య సినీ ప్రపంచంలో సత్తా చూపించడానికి కథానాయికలు సదా సిద్దంగా ఉంటారు. గతంలో పలు ఉదాహరణలు కూడా ఉన్నాయి. తాజాగా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు కథానాయికలు మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు. 2015లో ఈ సినిమాలు విడుదల కానున్నాయి.
అనుష్క - రుద్రమదేవి / సైజ్ జీరో
'అరుంధతి'తో బెంగుళూరు బ్యూటీ అనుష్క ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఆమెను వెతుకుంటూ వచ్చాయి. వేదం సినిమాలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. విడుదలకు సిద్దమవుతున్న బాహుబలిలో హీరోతో సమానమైన పాత్ర చేస్తుంది. కాకతీయ వీరనారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'రుద్రమదేవి'లో అనుష్క హీరో అనే చెప్పాలి. వేసవిలో ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వీటి కోసం కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీ నేర్చుకుంది. త్వరలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ 'సైజ్ జీరో' షూటింగ్ ప్రారంభమవుతుంది. ఒక్క ఏడాదిలో మూడు మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు అనుష్క చేస్తుంది.
చార్మీ - జ్యోతిలక్ష్మి
గత దశాబ్ద కాలంలో చార్మీ చేసినన్ని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు మరొక హీరోయిన్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. 'అనుకోకుండా ఒక రోజు', 'మంత్ర' లాంటి విజయవంతమైన సినిమాలు చార్మీ ఖాతాలో ఉన్నాయి. తర్వాత చేసిన కావ్య's డైరీ, మంగళ, ప్రతిఘటన సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. కానీ, ఈ ఏడాది చార్మీ చేస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రచార చిత్రాలతో 'జ్యోతిలక్ష్మి' సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహిళా దినోత్సవం నాడు ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. బోల్డ్ కాన్సెప్ట్ తో సినిమా తెరకేక్కుతుంది.
అంజలి - చిత్రాంగద
'గీతాంజలి'తో గత ఏడాది కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకుంది అంజలి. ఆమె నటించిన ఫస్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. గీతాంజలి అందించిన విజయోత్సాహంతో 'చిత్రాంగద'గా సందడి చేయడానికి రెడీ అవుతుంది. పిల్ల జమిందార్ ఫేం అశోక్ ఈ సినిమాకు దర్శకుడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జర్నీ తదితర సినిమాలతో అంజలి నటిగా నిరూపించుకుంది. మరి, ఈ 'చిత్రాంగద' ఆమెకు ఎటువంటి పరీక్ష పెడుతుందో చూడాలి.
నయనతార - మయూరి
నయనతార కెరీర్ గమనిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. కథానాయికగా సినీ ప్రయాణం ప్రారంభించిన తొలినాళ్లలో గ్లామరస్ పాత్రలలో నటించింది. గత రెండు మూడేళ్ళ నుండి నటిగా తనలో కొత్త కోణం చూపిస్తుంది. శ్రీరామ రాజ్యం, కృష్ణం వందే జగద్గురుమ్, రాజా రాణి, అనామిక.. సరికొత్త నయనతార కనిపించింది. నయన్ ఇమేజ్ పెరిగింది. తాజాగా 'మయూరి' అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది. నయనతార ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆమె టాలెంట్, క్రేజ్, ఫేం మీద ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది.
త్రిష - హారర్ కామెడీ సినిమా
అందం, అభినయం కలగలిపిన నటిమణి త్రిష. దశాబ్ద కాలంగా ఏనాడు ప్రయోగాల జోలికి త్రిష వెళ్ళలేదు. వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అలాంటి త్రిష, తొలిసారిగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రధారి. ఇక్కడ కూడా కాస్త సేఫ్ జోన్ ఎంచుకుంది. హారర్ కామెడీలకు మార్కెట్లో గిరాకీ ఉండడంతో అటువంటి సినిమా చేస్తుంది.
స్వాతి - త్రిపుర
'గీతాంజలి' వంటి విజయవంతమైన సినిమా తర్వాత దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'త్రిపుర'. స్వాతి టైటిల్ రోల్ పోషిస్తుంది. శక్తిమంతమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా, నటిగా స్వాతిలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని దర్శకుడు తెలిపారు. తెలుగమ్మాయి స్వాతిని మనకంటే తమిళ, మలయాళ ప్రేక్షకులే ఎక్కువగా ఆదరించారు. ఈ సినిమా అయినా ఆమెకు మరింత మంది అభిమానులను, విజయాన్ని సాధించి పెడుతుందని ఆశిద్దాం.
హీరోలకు తాము ఏమాత్రం తక్కువ కాదని, అవకాశం వస్తే సత్తా చాటుతామని చెప్తున్న వీరికి సలాం.