తెలంగాణలో టీడీపీని నామరూపలు లేకుండా చేస్తామని టీఆర్‌ఎస్ నాయకులు శపథం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శపథాన్ని నెరవేర్చుకునే దిశగా టీఆర్‌ఎస్ అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి శాసన మండలిలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. తెలంగాణ శాసన మండలిలో ఇప్పుడు టీడీపీ వాణి వినిపించే వారు లేకుండా పోయారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న అరికెల నర్సారెడ్డి, పొట్ల నాగేశ్వరరావులు రాజీనామా చేయడంతో ఇప్పుడు శాసన మండలిలో ఆ పార్టీకి సభ్యులే లేకుండాపోయారు. ఇదివరకే టీడీపీ నుంచి ఐదు మంది ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారు. వీరిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఈ ఐదుగురులో కూడా బొడకుంటి వెంకటేశ్వర్లు, పట్నం నరేందర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణలు కూడా రిటైర్ అవబోతున్నారు. ఇక శాసన మండలిలో జరిగిన రీతిలోనే శాసన సభలోనూ వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా చేస్తామని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. మరి వీరు విజయం సాధించకుండా చంద్రబాబు ఎంతవరకు అడ్డుకుంటారో 2019లోనే తేలనుంది.