దేశ రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొస్తానంటూ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్ అనతి కాలంలోనే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన వ్యవహరశైలి మారిపోవడం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. క్రితంసారి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టుకోవాలా అంటూ సాగిన కేజ్రీవాల్ ఆలోచనలు ఈసారి ఆప్ పార్టీలో తనకు పోటీలేకుండా చేసుకోవడంపై నిలిచాయి. పార్టీలో తన తర్వాత స్థానాల్లో ఉన్న ప్రశాంత్‌భూషణ్, యోగేంద్రయాదవ్‌లను ఆప్ నుంచి బహిష్కరించడం పార్టీ కార్యకర్తలందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. న్యాయవాదిగా, ఉన్నదున్నట్టు మాట్లాడే వ్యక్తిగా ప్రశాంత్‌భూషణ్‌కు ఎంతో పేరుంది. ఇక ఆప్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒక్కరైన యోగేంద్రయాదవ్ మంచి వ్యూహకర్తగా ప్రసిద్ధి. అయితే వీరిద్దరికి పార్టీపై మంచి పట్టు ఉండటమే కాకుండా పలుమార్లు కేజ్రీవాల్ చేసిన తప్పులను మీడియా సమక్షంలోనే వీరిద్దరూ ప్రశ్నించారు. దీంతో ఎప్పటికైనా వీరిద్దరితోనే తనకు ముప్పేనని ఆలోచించిన కేజ్రీవాల్ ఎన్నికల తంతు ముగిసే వరకూ వేచిచూశారు. ఇక అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వీరిద్దర్ని బయటకు పంపడానికి చర్యలు చేపట్టారు. దీని ఫలితంగానే వారిద్దర్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక ఫక్తు రాజకీయాల్లోనే ఇదే తంతు కొనసాగుతుంది. తన ఎదుగుదలకు అడ్డువస్తున్న నాయకులను పక్కకు తప్పిస్తూ నాయకులు ముందుకు వెళ్తుంటారు. ఇక ఇక్కడ కేజ్రీవాల్ కూడా ఫక్తు రాజకీయవేత్తకు ఏమాత్రం తేడా లేకుండా వ్యవహరించారు. ఇంకోమాట చెప్పాలంటే వారి కంటే కూడా కేజ్రీవాల్ కొంత ముదురనే చెప్పాలి.