భాష బతకాలంటే మాట్లాడటం ఎంత ముఖ్యమో, చదవడం, రాయడం అంత ముఖ్యం. ప్రతివాడూ మాతృబాషలో మాట్లాడతారు; కానీ అందరికీ చదవడం - రాయడం రాదు. పత్రికలు, పుస్తకాలు ప్రజలు చదవాలి. గ్రంధలయోద్యమం పుణ్యమా అని దాదాపుగా ప్రతి ఊళ్ళో ఓ గ్రంధాలయం; ఏటేటా కొత్త పుస్తకాలు ఒకప్పుడు. ఇప్పుడు టివి ప్రభావంతో పుస్తకాలు చదవడం కొంతమేర, అందుబాటులో (ధర) పుస్తకాలు లేకపోవడంతో మరికొంతమేర చదవడం ఆపైన రాయడం తగ్గిపోతోంది. ఈ స్థితిలో మన వేదాలను, ప్రాచీన గ్రంధాలను లక్షలు వెచ్చించి ప్రచురించి సరస్వతికి అక్షరనీరాజనం జరుపుతోంది ఎమెస్కో. గ్రంధాలయాలకు పుస్తకాలు కొనడం మానేసింది ప్రభుత్వం. తెలుగు రచనల ప్రచురణని పెంచే ప్రయత్నమేదీ చేయలేదు ప్రపంచ తెలుగు మహాసభలు. ఎమెస్కో వలె మరి కొంతమంది తెలుగు పుస్తక ప్రచురణకర్తలు రిస్కుచేసి ప్రచురించిన పుస్తకాలతో ప్రతిఏటా హైదరాబాద్ - విజయవాడలో వారం రోజులపాటు పుస్తక మహోత్సవం నిర్వహిస్తారు. పుస్తక ప్రియులకు ఇంతకుమించిన పెద్ద పండుగ మరొకటిలేదు. 2014 సంవత్సరానికి ఉత్తమ ప్రచురణ సంస్థగా ఎమెస్కో జాతీయ అవార్డుకి ఎంపిక కావడం తెలుగు పుస్తకానికి లభించిన అరుదైన గౌరవం! ఎన్నడో రావుగారు ప్రారంభించిన ఇంటింట గ్రంధాలయం ‘ఎమెస్కో’ నేడు విజయకుమార్ - కృష్ణ సారధ్యంలో జాతీయ స్థాయికి ఎదగడం ప్రశంసనీయం; ప్రస్తావనీయం! తెలుగు అక్షరానికి ఎమెస్కో చేస్తున్న సేవ రెండు రాష్ట్రాలూ చేయడం లేదనడం సత్యం, సత్యం, సత్యం.