రాజకీయాల్లో అనుభవానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక పార్టీ అధిష్టానానికి అనుభవం లేకపోతే ఆ పార్టీ ప్రజాప్రతినిధులంతా చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఏకంగా శాసనసభా అధిపతిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనక్కితగ్గారు. ఇక స్వయంగా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పిన జగన్ ఇప్పుడు ఆయనకే క్షమాపణలు చెబుతామనడం ప్రజలకు ఎలాంటి సంకేతానిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీదే తప్పు ఉందన్న భావన ఇప్పుడు ప్రజల్లో నెలకొనే అవకాశం ఉంది. ఇక స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనిత సభాహక్కుల ఉల్లంఘన నోటీసునిచ్చారు. దీంతో వైసీపీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు కూడా వరుసపెట్టి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా టీడీపీ సభ్యులు రెచ్చగొట్టడంతోనే తాము ఆ వ్యాఖ్యలు చేశామంటూ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. మరి రెచ్చగొట్టిన టీడీపీ సభ్యులపై కాకుండా శాసనసభాధిపతిపై వీరు ఎందుకు రెచ్చిపోయారో చెప్పమంటే సమాధానం కరువైంది.