ఓవైపు సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు;
మరోవైపు జాతీయ ఉత్తమ చిత్రంగా ‘కోర్ట్’
న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ చైతన్య తమానే రూపొందించిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం; భారత సర్వోన్నత న్యాయస్ధానం ఐటీ చట్టంలోని ‘‘66 ఎ’ సెక్షన్‌ను కొట్టేయడం ఒకేరోజున జరగడం యాదృశ్ఛికం కావచ్చు; చరిత్రలో నిలిచిపోయే రోజు!
భారత రాజ్యాంగంలోని 19 (1-ఎ) అధికరణ భారత పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్ళుగా మారిన - సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటి) చట్టంలోని 66 ఏ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్ధానం కరాఖండీగా తేల్చేయడంతో దేశవ్యాప్తంగా హర్షామోదాలు నమోదయ్యాయి; సుప్రీం తీర్పుని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఈ సందర్భంలో రెండు ముఖ్యమయిన విషయాలు ప్రస్తావనార్హం.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించిన వారికి, సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్ధానం ‘సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటాం’ అన్న హామీని ఇచ్చారు. ఆ కేసు గురించి విస్తృత సమాచారం ఇచ్చిన ప్రసార మాధ్యమాలు తర్వాత ఆ కేసు విషయాన్నే మర్చిపోయాయి. ఒక విషయమై కొంత సమాచారాన్ని ఇచ్చి ప్రజలలో ఆసక్తిని రేపి అంతటితో వదిలేసే ప్రసార మాధ్యమాల బాధ్యతని కూడా న్యాయస్ధానం గుర్తుచేస్తే బాగుంటుంది. అలాగే ఓ జఠిలమయిన విషయం తలెత్తినప్పుడు ‘చట్టం’ తన పనిని తాను చేసుకుపోతుంది’ అంటూ ఆ సమయాన ఆ విషయాన్ని దాటవేయడం జరుగుతోంది. కానీ ‘చట్టం’ తీసుకున్న చర్యలను తదుపరి కాలంలో చెప్పడంలేదు.
ఇదే సందర్భంగా సినిమా మీడియాకి సెన్సారు సంకెళ్ళు తొలగించాలని కమలహాసన్ డిమాండ్ చేస్తున్నారు. ఇదికూడా చిన్న విషయం కాదు.
ప్రజాస్వామ్యానికి ప్రతి ఒక్కర్నీ జవాబుదారీని చేస్తే ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకి ‘దిశ’ నిర్దేశించిన ఘనత భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి దక్కుతుంది.