దాసరి ఇక ‘సరి’; ఇది ఎన్నోసారి?
తెలుగు సినిమా పరిశ్రమ దాసరి సినిమా తీస్తే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటుంది; దాసరి సినిమా తీయకపోతే ఆయన సైలెన్స్‌కి సవాలక్ష కారణాలు వెదుకుతుంది. ఆయన ఏదైనా ఫంక్షన్‌కి ముఖ్య అతిధిగా వెళ్తే, పాత్రికేయులకి కావలసినంత మసాలా దొరుకుతుంది; ఎందరో సినీ జీవులు భుజాలు తడుముకుంటారు. ఎంతో ఎందుకు - ఆయన పవన్ కళ్యాణ్‌తో సినిమా అనగానే పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయన్నారు. అల్లు అర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఆడియో ఫంక్షన్‌లో దాసరి పవన్ కళ్యాణ్ స్టైల్‌ని ఎందరో హీరోలను ప్రభావితం చేస్తున్నా, పవన్ కళ్యాణ్‌ని అనుకరించని ఏకైక హీరో అల్లు అర్జున్ - అని అటు పవన్ కళ్యాణ్‌ని ఇటు బన్నీని పొగిడారు. చిరంజీవి పేరు ప్రస్తావించకపోయినా రామ్ చరణ్ తనదైన స్టైల్‌లో కోతిబొమ్మతో ఫేస్‌బుక్‌లో విరుచుకుపడ్డారు. అల్లు అర్జున్ కూడా ‘‘రుద్రమదేవి’’ వరంగల్ - ఆడియో ఫంక్షన్‌లో పరోక్షంగా ప్రస్తావించారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ - జయసుధ పోటీపడుతుంటే, ‘పబ్లిక్’గా దాసరి గురించే మాట్లాడుకుంటున్నారు.
ఒకప్పుడు రాఘవేంద్రరావు సినిమా ప్రకటిస్తే, దాసరి ఏం చేస్తాడోనని అందరూ దాసరివైపు చూసేవారు. రాఘవేంద్రరావు సినిమా ప్రారంభిస్తే దాసరి గురించి మాట్లాడుకోవడం ఏమిటి?
దాసరి ఫ్లాప్ ఇస్తే ‘దాసరి ఇక ‘సరి’’ అని సంబరపడేది కొందరయితే, ‘ఇది ఎన్నో‘సారి’’ అని ఎదురు స్పాంటేనియస్‌గా ప్రశ్నించేది మరికొందరు.
నేలకు కొట్టిన బంతిలా పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో అత్యుత్సాహంతో లేవడం ఆయనకే చెల్లింది.
పరిశ్రమలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా దాసరి దగ్గరకే వెళ్తారు. ఆయన ఇంటి తలుపులు ఎప్పుడూ బార్లా తెరిచేవుంటాయి. ఓపిగ్గా వారి సొదవింటారు. ‘ఏం భయంలేదు, నేనున్నా’ అంటూ భరోసా ఇస్తారు దాసరి. వారికి ఆయనేం చేస్తారన్నది వేరే విషయం.
చర్చి ప్రీస్ట్ దగ్గర భక్తుని కన్‌ఫెషన్ - గుళ్ళో దేవుని ముందు మొరపెట్టుకునే భక్తుడు - దాసరి ఇంటి తలుపు తట్టే సినీ జీవి : అందరూ ఒకటే!
దాసరి లేని తెలుగు సినిమాని ఊహించలేం!! ఆయన అంతే.
‘చిరంజీవి 150వ సినిమా’ అనగానే దాసరి 151వ సినిమా అన్నారు : జయాపజయాలు వేరు!
- ఎక్కడివాడు ఈ దాసరి?
‘సర్దార్ పాపారాయుడు’ ఎన్టీఆర్ రాజకీయాలకు ప్రేరణ!
అయిపోయాడనుకున్న అక్కినేనిని ‘ప్రేమాభిషేకం’తో మరోమారు అగ్రస్థానానికి తీసికెళ్ళిందీ ఈ దాసరే!
‘ఫ్లాప్స్’తో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో రాజ్యసభ సీటు - కేంద్ర మంత్రి హోదా!
ఎలా సంభవం?
అదంతే, ఆయన విషయంలో అలాగే జరుగుతుంది.
తెలుగువారు ఇద్దరే ఇద్దర్ని భరిస్తారు.
ఒకరు - దాసరి.
రెండవవారు - పవన్ కళ్యాణ్.
ఫ్లాప్ వెంట ఫ్లాప్ ఇచ్చినా, ‘‘ఈ సారైనా...’’ అనుకుంటూ ఆశతో వారి మూడో సినిమాకి, నాలుగో సినిమాకి పధ్నాల్గవ సినిమాకి కూడా వెళ్తారు.