సంగీత సరస్వతికి ‘ఈ టివి’ నీరాజనం అనదగిన ఈ కార్యక్రమానికి గణపతి సచ్ఛిదానంద స్వామీజీ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేయడం - అదీ ఉగాది పర్వదినాన - చెప్పుకోదగ్గ విశేషం. కానీ గణపతి సచ్ఛిదానంద స్వామీజీ మంచి గాయకుడు. ఆయన పాట - మాట వినడానికి కూర్చున్నవారికి కొద్దిగా అసంతృప్తి మిగిల్చింది. ‘మాట’ అనడంలోని ఔచిత్యం : మన పండితుల పంచాంగ శ్రవణం అన్ని టివిలు ప్రసారం చేశాయి. కానీ స్వామీజీ వీరందరికన్నా ముందుగా శివరాత్రినాడు భవిష్యవాణి వినిపించేవారు. ఈ మధ్య కాలంలో స్వామీజీ హోమగుండంలోకి ప్రవేశించడంలేదని విన్నాం. అగ్నిదేవుడు ఆయనకు బహూకరించే కానుకలపరంగా స్వామీజీ భవిష్యవాణి చెప్పేవారు. అటువంటి స్వామీజీ ఉగాదినాడు ‘అనుగ్రహ భాష్యం’ ప్రసాదిస్తారని ఆశించాం. వాక్సుద్ధివున్న స్వామీజీ చెప్పేది జరిగితీరుతుందని దత్త భక్తుల నమ్మకం. అందివచ్చిన గొప్ప అవకాశం చేజారింది; స్వామీజీ అనుగ్రహ భాష్యాన్ని ఆస్వాదించలేకపోయాం! స్వామీజీ ‘పాట - మాట’ అందించాలన్న సంకల్పం బాలూగారికి కలుగలేదు. అంతా భగవదేచ్ఛ!!