ఆంధ్రా రాజధాని ‘అమరావతి’ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం!
నేపాల్‌లోని ‘పశుపతి ఆలయం’ వలె హిందువులకు ప్రత్యేకించి శైవులకు ఆధ్యాత్మిక కేంద్రంగా అజరామరంగా వెలుగుతుంది అమరలింగేశ్వరుని ఆరామం - ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ‘అమరావతి’.
2006 జనవరిలో బౌద్ధగురువు దలైలామా ఆధ్వర్యంలో 2,00,000 మంది ప్రపంచ బౌద్ధ భిక్షులు దాదాపుగా అయిదురోజులు చేసిన పూజలతో ఈ కర్మభూమి పునీతమయింది.
ఇది హిందూ బౌద్ధులకే కాదు జైనులకూ ప్రత్యేకమయింది. ఇక్కడే చింతామణి పార్శ్వనాధ్ శ్వేతాంబర దేవాలయం వుంది; ఈ ప్రాంతంలో జైనమతానికి సంబంధించిన శిల్పాలు కనబడతాయి.
అశోక చక్రవర్తి, శ్రీకృష్ణ దేవరాయలు, చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్, బ్రిటిష్ జాతీయుడు కొలెన్ మెకంజీ సందర్శించిన చారిత్రక పట్టణమిది. అమరారామ క్షేత్రంలోని అమరలింగేశ్వరుని దేవగురువు బృహస్పతి పర్యవేక్షణలో ఇంద్రుడు ప్రతిష్టించాడని నమ్మకం!
అలాగే క్రైస్తవ మత సంబంధమైన ధార్మిక కార్యక్రమాలు, ముస్లింల ప్రసిద్ధ ప్రార్ధనా స్థలాలు ఇక్కడే వున్నాయి. వెరసి ఇదో సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం; పసుపు - పత్తి - మిర్చి - టొబాకో ప్రపంచ దేశాలకు ఎగుమతి కేంద్రం!
ఈ గడ్డపై పుట్టిన బిడ్డ జాతీయ అంతర్జాతీయ వేదికలపై తన ఘనతను చాటిని సందర్భాలెన్నెన్నో! ఎటువంటి ఒత్తిడిలకు లొంగక నూతన రాజధానికి ‘అమరావతి’ అని పేరు నిర్ణయించిన ముఖ్యమంత్రి అభినందనీయుడు.
- తోటకూర రఘు