ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు మెడకు బొగ్గు ఉచ్చు బిగుసుకుంటోంది. బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలకు సంబంధించి ఇప్పటికే దాసరిని సీబీఐ నిందితుడిగా పేర్కొనగా.. ఇక ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దాసరి ఆస్తులను జప్తు చేయడానికి చర్యలు ప్రారంభించింది. నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపు జరిగేలా దాసరి అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా జిందాల్ కంపెనీ యాజమాన్యం రూ. 2.25 కోట్లను దాసరికి చెందిన సౌభాగ్య మీడియా ఖాతాలో జమ చేసినట్లు ఆరోపణ. దీనికి సంబంధించి కొంతకాలం క్రితమే ఈడీ దాసరిపై హవాలా కేసు నమోదు చేసింది. ఇక దాసరికి సంబంధించి జప్తు చేయాల్సిన ఆస్తుల లిస్టును కూడా ఈడీ సిద్ధం చేసినట్లు సమాచారం. తాను ఎలాంటి తప్పు చేయలేదని దాసరి వాదిస్తున్నప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా సీబీఐ బలమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇక జగన్‌కు పట్టిన గతే దాసరికి కూడా పడుతుందని ఇండస్ట్రీలో వాదనలు కొనసాగుతున్నాయి.