ఇండో - పాక్ - బంగ్లా - ఆఫ్ఘనిస్తాన్ - శ్రీలంక సంయుక్తంగా జరుపుకునే పర్వదినాలు!
మార్చి 23 -
భగత్‌సింగ్ 84వ వర్ధంతి!
షాహిద్ భగత్‌సింగ్ జన్మస్థలం : పాకిస్తాన్ - లమాన్‌పూర్‌జిల్లా బంగా గ్రామం.
శాండర్స్ హత్య : 1930 అక్టోబరు 7న లాహోర్ స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టు భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లకు ఉరిశిక్ష విధించింది.
ఇటువంటి అమరవీరుల జన్మస్థలాలు, జన్మభూమికై అసువులు బాసిన ప్రదేశాలు ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో కనిపిస్తాయి. నేటికీ మన్‌మోహన్ సింగ్, అద్వాని వంటి భారతీయ నాయకుల - దిలీప్ కుమార్ వంటి ఫిలిమ్ సెలబ్రిటీల - గాయనీ గాయకుల, చిత్రకారుల జన్మస్థలాలు పాకిస్తాన్‌లో వున్నాయి. ఆ ప్రదేశాలు - ఆ కట్టడాలు చిరస్మరణీయంగా వుండాలి. దసరా - వినాయకచవితి - బక్రీద్ వలె ఈ మహామహుల జయంతులను, వర్ధంతులను అంతర్జాతీయ వేడుకలుగా ఈ దేశాలన్నీ జరుపుకోవాలి. భావితరాలకోసం వారి త్యాగాలు అధ్యయనం చేసేలా చూడాల్సిన బాధ్యత మనందరిదీ. ఈ ఉపఖండం ఒకటిగా పిడికిలి బిగించిన - శ్వాసించిన మహోజ్వల ఘట్టాలు సరిహద్దుల్ని చెరిపేస్తాయి; వైషమ్యాలను మటుమాయం చేస్తాయి. ఒకప్పుడు ఒకటిగా కలిసి బతికిన మనం ఇప్పుడు కనీసం చుట్టరికాలనయినా కలుపుకోలేమా? ఈ దిశగా ముత్తయ్య మురళీధరన్ - సానియా మీర్జావలె ముందడుగేయలేమా? ఇండియా అబ్బాయి / అమ్మాయి ఓ అమెరికన్ / జపనీస్ / చైనీస్ / థాయ్‌లాండ్ వధువుని / వరుడ్ని ఎంపిక చేసుకుంటున్నప్పుడు ఇండో - పాక్ - బంగ్లా - ఆఫ్ఘన్ - శ్రీలంక మధ్య వివాహ సంబంధాలు ఎందుకు సాధ్యంకాదు? ఈ నిశ్శబ్దం బద్దలవ్వాలి. షారూక్‌ఖాన్ సినిమా ప్రేమకథ నిజం కావాలి!! దేశంకోసం ప్రాణాలర్పించిన వారిని నేషనల్ హీరోస్‌గా భావితరాలు పూజించాలి!