ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ప్రభుత్వం పేరును ఖరారుచేసింది. మొదట రాజధానికి సీనియర్ ఎన్టీఆర్ పేరును ఖరారు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మేరకు టీడీపీ వర్గాల నుంచి, నందమూరి అభిమానుల నుంచి డిమాండ్లు వినిపించాయి. అయితే అందరికి షాక్‌నిస్తూ చంద్రబాబు రాజధానికి అమరావతి పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న రాజధాని ప్రముఖ పర్యాటక ప్రాంతం అమరావతికి సమీపంలో ఉండటంతోనే ఈ పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ పేరును ఖరారు చేయడంతో అంతర్జాతీయంగా కూడా బౌద్ధ మతస్తుల్లో నూతన రాజధానికి ప్రాధాన్యత లభిస్తుందని, పర్యాటలకును కూడా ఆకర్షించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజధానికి అమరావతి అన్న పేరు పెట్టినంత మాత్రాన బౌద్ధ మతస్తులు పరుగెత్తుకు రారని, ఎన్టీఆర్ పేరు పెట్టడం ఇష్టంలేకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని నందమూరి అభిమానులు విమర్శిస్తున్నారు. కనీసం కృష్ణా జిల్లాకైనా సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఈ డిమాండ్‌నైనా బాబు పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచిచూడాలి.