తెలంగాణలో మళ్లీ దొరలరాజ్యం కొనసాగుతోందన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. వెలమ, రెడ్డి వర్గాలు మళ్లీ రాజ్యం చలాయిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు మాజీ మంత్రి రాజయ్య, మంత్రి జగదీష్‌రెడ్డి ఉదాంతాలనే ఉదాహరణగా చెబుతున్నారు. డిప్యూటీ సీఎం రాజయ్య అవినీతికి పాల్పడటంతోనే పదవినుంచి తొలగించినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు అప్పట్లో గొప్పలు చెప్పుకున్నాయి. తమది అవినీతి మురికి అంటని ప్రభుత్వమని రాజయ్య భర్తరఫ్‌ను బలపరుచుకున్నాయి. అదే సమయంలో మంత్రి జగదీష్‌రెడ్డిపై కూడా అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకులే వరుసపెట్టి జగదీష్‌రెడ్డిపి విమర్శలు చేసినా కేసీఆర్ సర్కారు స్పందించలేదు. అదేసమయంలో రాజయ్యపై మాత్రం ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకున్నా, ఐబీ రిపోర్టుతో చర్యలు తీసుకున్నట్లు కేసీఆర్ సర్కారు చెప్పుకొచ్చింది. మరి జగదీష్‌రెడ్డిపై ఇంతపెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నా.. కనీసం కేసీఆర్ విచారణకు కూడా ఆదేశించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజయ్య దళితుడైనందునే కేసీఆర్ చర్యకు ఉపక్రమించారని, అదే జగదీష్‌రెడ్డి బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతోనే భర్తరఫ్ చేయడానికి అధినాయకుడు జంకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.