ఏపీ ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. కేంద్రంపై పెట్టుకున్న ఆశలను మోడీ సర్కారు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ తదితర హామీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోలుకోనివ్వడం లేదు. దీనికితోడు రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం కష్టాలను ద్విగుణీకృతం చేసింది. ఇక చివరకు ఆర్‌బీఐ ఇచ్చే ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణ ప్రకటించారు. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే గ్రాంట్ల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను కూడా అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పథకాలను అమలు చేస్తే కేంద్రం వందల కోట్లు కూడా ఇవ్వదని, రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ పథకాల అమలు ప్రాధాన్యతలేనిదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొసరు కోసం తిప్పలు పడితే అసలుకే ఎసరు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.