మంత్రి మండలి నిర్ణయాలను అమలుచేసేది ఐఎఎస్ అధికారులు! అధికారంలోనున్న వారికి ‘అతి’ విధేయత ప్రదర్శించి కొందరు, అమాత్యుల అడ్డగోలు సిఫారసులు అమలుచేయక ఆగ్రహానికి గురయ్యేది మరికొందరు. వైయస్సార్ హయాంలో బోనెక్కిన అధికారులను చూశాం. జగన్ మళ్ళీ అధికారానికి వస్తాడేమోనని బెంబేలుపడిన అధికారులనూ చూశాం.
జగన్ ముఖ్యమంత్రి అవుతాడేమోనని అప్రమత్తమయిన ఓటర్లను కూడా చూశాం.
కేంద్రంలో సోనియాని, రాష్ట్రంలో రోశయ్యని కలవరపరిచిన జగన్మోహన్‌రెడ్డినీ చూశాం. ఆంధ్రాలో చంద్రబాబు అధికారానికి వస్తాడేమోనని రాష్ట్రాన్ని విభజించడానికి సోనియా తొందరపడేలా ఒత్తిడిపెంచింది ఈ జగనే! ఇటు జగన్ - అటు తెలంగాణ మంత్రులు, అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ‘నాకొద్దీ పదవి’ అని ముఖ్యమంత్రి స్థానంలోనున్న రోశయ్య మొత్తుకున్నారు.
ఇప్పుడు చంద్రబాబుదీ అదే పరిస్థితి. నూతన రాజధాని - లోటు బడ్జెట్ - పోలవరం ప్రాజెక్టు - పట్టిసీమ ఎత్తిపోతల పధకం - కొత్త ప్రాజెక్టులు - విద్య వైద్యాలయాలు - రుణమాఫీ - సంక్షేమ పధకాలవైపు దృష్టి సారించకుండా పాలనా యంత్రాంగాన్ని స్తంభింపజేస్తున్నాడు జగన్. తెలుగు టివి ఛానల్ ‘ఆన్’ చేస్తే చాలు : అసెంబ్లీలో బూతుల పురాణం! అభివృద్ధిలో నిన్నటివరకు తెలంగాణతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ ఉగాదినాడు ‘బూతుల పంచాంగం పఠనం’లో నిమగ్నమయివుంది.
‘ఛీ .... ఎందుకుంటున్నాం ఈ రాష్ట్రంలో’ అని సామాన్యుడు ఉగాది పండుగనాడు తనని తాను తిట్టుకునే దుస్థితి ఏర్పడిరది!
- తోటకూర రఘు