కృష్ణాజిల్లాకి సరైన సమయంలో సరైన కలెక్టరు, నిఖార్సయిన సిపి దొరికారు! అందరూ రాష్ట్ర రాజధాని ‘తుళ్ళూరు’ గురించే మాట్లాడుకుంటున్నారు గాని, కృష్ణాజిల్లా ప్రత్యేకించి విజయవాడ సైలెంట్‌గా స్మార్ట్‌సిటీగా వేగంగా ముస్తాబవుతోందని గమనించడంలేదు. ముందుగా అభినందించాల్సింది కమీషనర్ ఆఫ్ పోలీసు వెంకటేశ్వరరావు గారిని. ఎక్కడా హడావిడి, ఆర్భాటాలు, ప్రజలు అసంతృప్తి లేకుండా రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ని క్రమబద్దీకరిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు కళ్ళెంవేస్తూ ఆకతాయిలను అదుపులోపెడుతూ పోలీసులు తమ పని తాము చేసుకుపోయేలా పాలనను వికేంద్రీకరించిన తీరు అమోఘం. ప్రత్యేకించి పరీక్షల సమయమిది. ‘విద్యలవాడ’గా వాసికెక్కిన విజయవాడ ఇంటర్ విద్యారంగానికి కేంద్రం. దీనికితోడు మంత్రులు - అధికారుల రాకలు, ప్రొటోకాల్ నిబంధనలు. ఈ హడావిడిలోనూ ‘లా అండ్ ఆర్డర్’ అద్భుతం. పైపెచ్చు శివరాత్రి - ఉగాది - శ్రీరామనవమి పర్వదినాలలో పోటెత్తే భక్తులు. అయినా చెక్కుచెదరని ప్రజాజీవనం! హేట్సాఫ్ టు పోలీసు బాస్!!
అలాగే జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన ‘ఐటి లెజండ్’ బాబు ఎ! ఇ-సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా సాఫీగా సాగేలా బ్యాకప్‌తో ఓ యజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఆయన ప్రజ్ఞాపాటవాలు తెలిసిన ముఖ్యమంత్రి, కావాలని బాబుని కృష్ణాజిల్లాకి తెచ్చారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ -ఎల్‌ఈడీ లైటింగ్ - వైఫై కనెక్టివిటీ - లేడర్ టెక్నాలజీ - స్మార్ట్ నెంబర్ - కమాండర్ కంట్రోల్‌రూం తదితర అంశాలతో సిఎం క్యాంపు కార్యాలయంకానున్న ఇరిగేషను కార్యాలయం నుంచి బెంజిసర్కిల్ వరకు సమగ్ర సర్వే కేవలం 40 రోజులలో పూర్తి చేయనున్నారు. తాను పనిచేయడం గాదు, తన టీమ్‌తో పనిచేయించడం - ఏ పనినయినా సమర్ధవంతంగా చేసేలా సంసిద్ధులను చేయడం కృష్ణాజిల్లా కలెక్టరు గొప్పతనం. సిస్కో, ఒప్పల్. నిప్పన్, బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ టీమ్‌లో వున్నారు. కృష్ణాజిల్లా కలెక్టరుకి విజయవాడ మునిసిపల్ కమీషనరు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. బెజవాడ బార్సిలొనాలా భాసిల్లబోతోంది.
కొసమెరుపు : కాంగ్రెసు హయాంలో విజయవాడ ఎంపీ లగడపాటి - కృష్ణాజిల్లా మంత్రి పార్ధసారధి : ఇద్దరూ ఇంజినీర్లే - ఇద్దరూ ఇండస్ట్రియలిస్టులే. కనకదుర్గ ఆలయంవద్ద ట్రాఫిక్ సమస్య - ఈ ఇద్దరు ఇంజినీరింగ్ చేసిన ప్రజా ప్రతినిధుల కాలంలో పరిష్కారం కాలేదు. కలెక్టరు బాబు హయాంలో బ్రిడ్జి నిర్మాణం ఆరంభమవుతోంది!! దట్స్‌ఇట్.
- తోటకూర రఘు