ఈ మధ్యకాలంలో ఆంధ్ర - తెలంగాణలో చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే మనం అఫ్ఘానిస్థాన్‌లో వున్నామా? భారత దేశంలో వున్నామా? అన్న సందేహం కలుగుతోంది. అప్పుడెప్పుడో అఫ్ఘానిస్థాన్‌లోని బౌద్ధ విగ్రహాలను పేల్చివేశారు; హిందూ దేవాలయాలను కూల్చివేశారు. నిన్నగాకమొన్న హైదరాబాదు ట్యాంకుబండ్‌పైనున్న తెలుగు ఆంధ్ర వైతాళికుల విగ్రహాలను కూల్చివేశారు; తెలుగులో ఆది కవి నన్నయ్యకాదు పాల్కురికి అని పాఠ్యగ్రంథాలను మార్చేస్తున్నారు; శ్రీశ్రీ -విశ్వనాధ వంటి వారి ప్రాముఖ్యతను తగ్గించేస్తున్నారు. అదేమంటే నన్నయ్య భారతం అనువాదం; సోమనాధుడికి స్వతంత్ర రచన అన్నారు.
ఆంధ్రులుకూడా ఈ విషయంలో తక్కువేంకాదు. శ్రీరామనవమి భద్రాద్రిలో జరగుతోంది - ఆనవాయితీగా. పోటీగా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణం జరపాలనుకోవడం; ఆ దేవాలయంలో రాత్రిపూట జరిగే కళ్యాణతంతువేళని మార్చడం సమర్ధనీయమా? అలాగే ప్రపంచ తెలుగు మహాసభలను విజయవాడలో నిర్వహిస్తూ తెలంగాణ మంత్రులను - కవులను ఆహ్వానించకపోవడం సమర్ధనీయమా? ఈ ఏడాది విజయవాడలో వచ్చే ఏడాది విశాఖలో అనడాన్ని హర్షించగలమా?
ప్రపంచీకరణ - విద్య, ఉపాధి అవకాశాలు ప్రాంతీయ భాషలకు సవాలు విసురుతున్నాయి. ఈ తరుణంలో భావితరాలను అయోమయానికి గురిచేయడం సమర్ధనీయమా? నిన్నటివరకు ఆదికవి నన్నయ్య అని చదువుకొని, కాదు కాదు పాల్కురికి సోమనాధుడు అని చెప్పడం ఎంతవరకు సమర్ధనీయం? తొలి తెలుగు స్వతంత్ర కవి లేదా తొలి తెలుగు తెలంగాణ కవి అని పాల్కురికిని చెప్పవచ్చుగదా!
రాముడు అందరికీ దేవుడే!
భద్రాద్రిలో జరిగే శ్రీరామ కళ్యాణానికి పోటీగా అదే సమయంలో ఒంటిమిట్టలో కళ్యాణమేమిటి?
ప్రతి ఏడాది ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణం జరిగినట్టే ఈ ఏడాదీ జరుపవచ్చుగదా!
ఎక్కడో అఫ్ఘానిస్థాన్‌లో ఏదో జరిగిందని వాపోయాం; ఇప్పుడు మనమేం చేస్తున్నాం? లండన్‌లో - దక్షిణాఫ్రికాలో బాపూజీ స్మారక మందిరాలు; కానీ మనం రూపాయి నోటుపై గాంధీ బొమ్మ తొలగించాలి - గాంధీజీని ‘మహాత్మ’ అని సంబోధించడాన్ని నియంత్రించాలి అంటున్నాం!!
మనల్ని మనం సమర్ధించుకోగలమా?
నిండు సభలో - పెద్దల సభ అనబడు రాజ్యసభలో దక్షిణాది స్త్రీ రంగుని రూపలావణ్యాలను ఓ పార్టీ ప్రముఖుడు వర్ణిస్తుంటే - కేంద్రమంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తుంటే - సభ యావత్తు కిమ్మనకుండా వుండిపోయిందట! ఆ వార్త పత్రికలలో చదువుతుంటే కురు సభలోకి ఈడ్చుకురాబడ్డ ద్రౌపది - భీష్మ ద్రోణ కృపాచార్యులు స్ఫురణకొచ్చారు! హతోస్మి!!
- తోటకూర రఘు