చిరు ‘బాటన్’ని ప్రజలు అందిపుచ్చుకున్నారు!
‘గోరా’ కుటుంబానికి కలెక్టర్లు - పోలీసు అధికారుల సహకారం కావాలి
రక్తదానం - నేత్రదానం : అవయవదానం!
- ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళింది; తన అభిమానులను సేవా కార్యక్రమంలోకి తీసుకొచ్చిందీ; ఎందరికో స్ఫూర్తినిచ్చింది చిరంజీవే!
2014 - ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా జరిగి తన 150వ చిత్రం గురించే ఆలోచిస్తున్న చిరంజీవి తన అభిమానులను సేవాకార్యక్రమాలకు పునరంకితం కావలసిందని కోరడం జరిగింది. ఈరోజున ఆంధ్రప్రదేశ్‌లో ‘అవయవదానం’ అద్భుతమైన ప్రచారాన్ని అందుకుంది; దానం చేసినవారికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ చైతన్య దీప్తి చిరంజీవిదే! అవయవదానం వాడవాడలా ఊపందుకుంది. దీనిని ఓ ఉద్యమంలా మారుమూల ప్రాంతాలకు తీసికెళ్ళాల్సిన బాధ్యత చిరంజీవిపైనే వుంది.
ఇదే సమయంలో, చిరంజీవి ‘రక్తదాన ` నేత్రదాన’ కార్యక్రమాలను శాస్త్రీయంగా నడపపడానికి అండగా దండగా నిలిచింది ‘గోరా’ వారసుడు డాక్టరు సమరం. నేటికీ ఆయన నాస్తిక కేంద్రంలో వారం వారం ‘హెల్త్ అవేర్‌నెస్’ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు; మూఢ నమ్మకాలను నిరసిస్తూ వాడవాడలలో ప్రచారంచేస్తున్నారు. ‘నాస్తికోద్యమం’ ఆవశ్యకత ఎంతగా వుందో నేటి దిన పత్రికలు చూస్తే అర్ధమవుతుంది. కొన్ని సందర్భాలలో మూఢనమ్మకాలు విశ్వసించేవారు సమరం బృందంపైన జనవిజ్ఞాన కేంద్ర సభ్యులపైన దాడిచేసిన సంఘటనలున్నాయి. ‘గోరా’ కుటుంబం, ‘జన విజ్ఞాన కేంద్రం’ చేపట్టే ఈ కార్యక్రమాలు వాడవాడలా దిగ్విజయంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో చొరవచూపాలి; పోలీసు అధికారులు ఈ బృందానికి రక్షణ కల్పించాలి. లేకుంటే చేతబడులపేరుతో మూఢ నమ్మకాలతో సజీవ దహనాలు పెట్రేగిపోతాయి; ఆస్తి తగాదాలకు ఈ మూఢనమ్మకాలు సాకుగా జూపి హత్యలు జరుగుతాయి.
- తోటకూర రఘు