రాష్ట్ర విభజనలో ‘చిన్నమ్మ’ పాత్రని ఆంధ్రులు మర్చిపోగలరా?
టిడిపి - పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ విచిత్ర వేషధారణ, పత్రికా ప్రకటన, నన్నపనేని రాజకుమారి కంటతడి వగైరా వగైరా ‘బిజెపి -టిడిపి’ కలహాల కాపురంలో అగ్నికి ఆజ్యం పోసింది. టిడిపిపై ఎదురుదాడికి బిజెపి రాష్ట్ర శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన - పంజాబ్‌లో అకాలీదళ్‌ని దూరంజేసుకొని ఢల్లీిలో గట్టిదెబ్బతిన్న బిజెపి చంద్రబాబుని తక్కువ అంచనావేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే. తాను అధికారంలో వుంటేచాలు, ఒక కూటమిని తయారు చేయగల సామర్ధ్యం చంద్రబాబుకి వుంది. ఢల్లీిలో ఆప్ ఘన విజయం తర్వాత తృతీయ కూటమి ఊపందుకోలేదు: చంద్రబాబు లేని తృతీయ కూటమి సత్తా ఏమిటో బట్టబయలయింది. చంద్రబాబు రింగ్ లీడర్` కింగ్ మేకర్. చంద్రబాబుని కట్టడిచేయడానికే ఆంధ్రప్రదేశ్‌ని విభజించింది కాంగ్రెసు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాత్రని టివిలో ప్రత్యక్షంగా చూసినవారు, రాష్ట్ర విభజన తర్వాత ‘ఈ చిన్నమ్మని మర్చిపోవద్దు’ అని తెలంగాణ వారిని ఉద్దేశించి సుష్మాస్వరాజ్ అన్న మాటలు, సుష్మాస్వరాజ్‌ని తెలంగాణ ఇలవేలుపు బతకమ్మగా కెసిఆర్ అభివర్ణించిన వైనాన్ని సీమాంధ్రులు మర్చిపోలేరు. రానున్న ఎన్నికలముందు ఏ టివి ఛానెల్ అయినా ఈ దృశ్యాలను ప్రసారంచేస్తే, లోటు బడ్జెట్‌తో -అత్తెసరు కేంద్ర నిధులతో అల్లాడుతున్న సీమాంధ్రులు బిజెపికి ఓటేయడం కల్ల. రాజ్యసభలో వెంకయ్యనాయుడి పోరాటాన్ని చూపించి లాభపడ్డారు- సుష్మాస్వరాజ్ పాత్రని చూపించి వుంటే ఫలితాలు మరోలా వుండేవి.
బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ - తమిళనాడులో నడిచొచ్చే దేవత జయలలిత - ఉత్తర ప్రదేశ్‌లో ములాయం -బీహార్‌లో నితీష్ - ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ - మహారాష్ట్రలో శివసేన - పంజాబ్‌లో అకాలీదళ్ -వామపక్షాలను ఒకే వేదికమీదకు తీసుకురాగల సత్తా చంద్రబాబుకి వున్నదన్న సత్యాన్ని బిజెపి మరువరాదు.
2014 రాష్ట్ర విభజన : పార్లమెంటులో సుష్మాస్వరాజ్ - 2015 కేంద్ర ఆర్ధికమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ: ఆంధ్రప్రదేశ్‌కి విదిలించిన బిచ్చం క్లిప్పింగ్స్‌ని ప్రసారంచేస్తే చాలు బిజెపికి డిపాజిట్‌కూడా దక్కదు. చెట్టు ఎత్తు భూమిపై ఎంతగా వున్నదన్నదే చూస్తాం గాని భూమిలోపల దాని వ్రేళ్ళు ఎంత లోతుగా వ్యాపించాయని చూడం. చంద్రబాబు లోతయినమనిషి అని బిజెపి మర్చిపోగూడదు.
ఒక విలువయిన భాగస్వామిని దూరం చేసుకోవడం బిజెపికి మంచిదికాదు, అదే సమయంలో పార్లమెంటులో ‘పెప్పర్ స్ప్రే’ ప్రయోగించిన అపఖ్యాతి మూటగట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పగటి వేషగాళ్ళుగా జాతి కీర్తిని పలచన చేయడం గర్హణీయం! చంద్రబాబు తన ఎంపీలను కట్టడిచేయడం చాలా అవసరం!!
-తోటకూర రఘు