ఎన్టీఆర్‌ది ప్రభంజనం, కమ్యూనిస్టులది ఉత్తాన పతనం!
1982
ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం!
సంప్రదాయ వాదులు ఓ సినీ నటుడ్ని తమ నాయకునిగా అంగీకరించలేదు. కానీ అప్పుడే ఓటు హక్కు వచ్చిన -రాని యువత ఆయనకు అండగా నిలబడ్డారు. కొడుకు మాట కాదనలేక తల్లి -మనవడి ముచ్చట తీర్చడానికి నానమ్మ - ‘ఆడపిల్లలకి ఆస్తి హక్కు’ అని ఆడపిల్లలు : ఆ ఇంట్లో కాంగ్రెసుకి వచ్చింది ఒక ఓటయితే ఎన్టీఆర్‌కి వచ్చింది నాలుగు ఓట్లు. అదో ప్రభంజనం.
2014
రాష్ట్ర విభజనకు అనుకూలంగా సిపిఐ, వ్యతిరేకంగా సిపిఎం.
పార్టీల నిర్ణయం తెలంగాణలో సిపిఎం కేడర్ మనోభావాలను, ఆంధ్రాలో సిపిఐ కేడర్ మనోభావాలను దెబ్బతీసింది. సిపిఎం రాఘవులు పార్టీ నిర్ణయాన్ని చెప్పి, ప్రభుత్వపరంగా మీ నిర్ణయం మీరు తీసుకోండి ` అని అంతిమ నిర్ణయం పాలకులకే వదిలారు. కానీ సిపిఐ నారాయణ తెలంగాణ సమరయోధునిలా తన మాటలతో సీమాంధ్రుల గుండెలను ఛిద్రం చేశారు. ‘సమైక్యాంధ్ర’ సభకు వచ్చి తన వాదనను వినిపించమని నాటి కాంగ్రెసు ఎంపీ లగడపాటి సిపిఐ నారాయణను ఆహ్వానిస్తే ‘‘నాలుక పీకేస్తా.’’ అంటూ హూంకరించారు నారాయణ. ఫలితంగా పార్టీ సభ్యుల సంఖ్యకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి కమ్యూనిస్టులకి. ప్రజలమధ్య వుంటూ ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టు నాయకులు బుల్లితెరపై తమ ఉపన్యాసాలు ఇవ్వడం అలవాటుజేసుకున్నారు. ఫలితం - ఓట్లే గాదు నోట్లూపోయి అప్పులపాలయింది సిపిఐ. పార్టీ ఆస్తులమ్మి అప్పులు తీర్చాల్సిన దుస్థితి! ఇంతటి ఘోరపతనం చరిత్ర మున్నెన్నడూ చూసి వుండదు.
సిపిఐ నారాయణది ఒక పంధా అయితే, సిపిఎం రాఘవులుది మరో పంధా. ‘బిజెపి’లో దేశభక్తులే లేరని, దేశభక్తులంటే కమ్యూనిస్టులేనని సెలవిచ్చారు ఈ కామ్రెడ్. ఇంతకీ కమ్యూనిస్టులంటే సిపిఐ - సిపిఎం - నక్సలైట్లు - జనశక్తి కార్యకర్తలు వగైరా వగైరాలలో ఎవరో స్పష్టంగా చెప్పలేదు. నక్సలైట్లని దేశభక్తులుగా అభివర్ణించారని భావిద్దాం; ఆయనను గౌరవిద్దాం!
పనిలోపనిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిశారు. తర్వాత గుంటూరు వచ్చి ‘కన్నీటి రాజధాని వద్దేవద్దు’ అంటూ బైఠాయించారు. చంద్రబాబుని వ్యక్తిగతంగా కలిసినప్పుడే భూసేకరణ విషయమై ఆయనను నిలదీయవచ్చు గదా!
-ఎవరి రాజకీయాలు వారివి.