పార్ట్ 4
పవన్‌కళ్యాణ్ గారూ మీరూ చంద్రబాబుని ఇంతకాలం ఎలా సమర్ధించారు?
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ దేశప్రజలందరికీ తెలియని రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ రాజకీయాలలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు ఓ వెలుగు వెలిగారు. ఎన్టీఆర్ చరిష్మాని తట్టుకున్న దిట్ట ఆయన. అటువంటి చంద్రబాబు తన కేబినెట్ సహచరుడు కెసిఆర్ బయటకు వెళ్ళి పార్టీ పెట్టి, పొత్తుకోసం చంద్రబాబు వెంపర్లాడే స్థితిని కల్పించాడు. ఇది కెసిఆర్ విజయమనాలా? చంద్రబాబు వైఫల్యమనాలా? పోచారం, నాగం, కడియం, తీగల, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ తదితర అతిరధ మహారధులు టిడిపిని వీడి బిజెపి, టిఆర్‌ఎస్ పంచన చేరడం చంద్రబాబు వైఫల్యం కాదా? 2004 ఎన్నికల తర్వాత, దశాబ్దకాలం ప్రతిపక్షానికే పరిమితమయిన చంద్రబాబు 2014 ఎన్నికలలో అధికారానికి రావడానికి ముఖ్యకారణాలు : జగన్‌ని ప్రజలు నమ్మకపోవడం, మోదీ హవా, పవన్ కళ్యాణ్ ప్రచారం, కాంగ్రెసు పట్ల ఏవగింపు, ‘చంద్రబాబు విజనరీ లెజండ్’ అన్న భావన! అంతా చేసి పదిలక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు చంద్రబాబు. ఓవైపు మీడియా, మరోవైపు కేసులు, ఇంకోవైపు మోదీ, పవన్ కళ్యాణ్ మోహరించినా జగన్ ఒంటెద్దుపోకడవల్ల కొద్దిపాటి ఓట్ల తేడాతో జగన్ అధికారాన్ని చేజార్చుకున్నాడు. ఈ స్థితిలో అధికారానికి వచ్చిన చంద్రబాబు మిత్రపక్షం బిజెపితో, అవసర సమయంలో అందివచ్చిన పవన్ కళ్యాణ్‌తో ఇచ్చిపుచ్చుకునే సమాచార మార్పిడిలేక కష్టాలనుకొని ఆంధ్రులనెత్తిన రుద్దుతున్నారు. నిన్నగాక మొన్న తనకు తానుగా చొరవ తీసుకొని కలిసిన పవన్ కళ్యాణ్‌కి రాష్ట్ర రాజధాని, భూ సేకరణ విషయమై స్పష్టమైన సమాచారమ్ ఇచ్చి తన విజన్‌ని ఆయన ముందుంచితే గుంటూరులో పవన్ కళ్యాణ్ ‘పవర్ షో’ ఉండేది కాదేమో! పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యకు వచ్చి పిడికిలి బిగించడంతో ఇదే విషయమై గళమెత్తుతున్న కమ్యూనిస్టులకి, జగన్‌కి నైతిక మద్దతు లభించినట్లేగదా! కేంద్రంలో మిత్రపక్షం అధికారంలో వుంది. వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి, సుజనా చౌదరివంటి కేంద్ర మంత్రులున్నారు : అయినా బడ్జెట్ కేటాయింపు విషయమై టిడిపి నాయకుల బహిరంగ విమర్శలతో సాధించిందేమిటి? నిన్నటివరకు నిప్పు, ఉప్పులా వున్న బిజెపి, టిఆర్‌ఎస్ సంబంధాలు స్నేహ బంధంగా బలపడుతున్నాయి. ఓవైపు ఎంఐఎంతో సయోధ్య సాగిస్తూనే బిజెపికి దగ్గరవుతున్నారు కెసిఆర్. ఇదే సమయంలో చంద్రబాబు ఒంటరివాడయి ఆంధ్రులను అనాధలను చేస్తున్నారు.
కెసిఆర్ ఓ మాట అన్నారు : ‘‘లోటు బడ్జెట్ వున్న రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలి’’ అని. కెసిఆర్ వ్యక్తం చేసిన సానుకూల దృక్పధాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోలేక పోయారు.
నిన్న జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యాడు. నేడు పవన్ కళ్యాణ్. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తంగా చంద్రబాబుకి దగ్గరగా వున్నది ఎవరు? అన్నది జవాబులేని ప్రశ్న.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయినుంచి ప్రధాని స్థాయికి మోదీ ఎదగగా, దేశ్ రాజకీయాలలో ‘కింగ్ మేకర్’ అనిపించుకున్న చంద్రబాబు ఓ బుల్లి రాష్ట్రానికి పరిమితమవడమేమిటి? వ్యూహ రచనలో, నమ్ముకున్న వార్ని నిలబెట్టుకోవడంలో, శ్రేయోభిలాషులకు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో చంద్రబాబు విఫలమవుతున్నారు! నమ్మకాన్నిమించిన అమ్మకం లేదు!
రాజధాని భూసేకరణ విషయమై కమ్యూనిస్టులు, జగన్ రాద్ధాతం చేస్తున్న వేళ కమ్యూనిస్టులకి పార్టీ కార్యాలయాలు ఎక్కడెక్కడ వున్నాయి? పార్టీ కార్యాలయానికి పదెకరాలు తీసుకున్న విషయాన్ని ఇంతకాలం ఎందుకు చర్చకు పెట్టలేదు? జగన్‌కి హైదరాబాదులో, బెంగుళూరులో, పులివెందులలో, ఇడుపులపాయలో వున్న గృహాలు ఎంత స్థలంలో వున్నాయి? బెంగుళూరు, హైదరాబాదులో వున్న ఇళ్ళలో ఎన్ని గదులున్నాయి? డైనింగ్ రూము, ఇంట్లోనే థియేటర్స్ వగైరా వగైరా వివరాలతో ఎందుకు ఎదురుదాడికి దిగలేదు? ఇది టిడిపి వైఫల్యం కాదా? గుంటూరులో బలవంతాన భూమి గుంజుకున్న ఉదంతాలుంటే చూపండని టిడిపి శ్రేణులు ఎందుకు సవాలు చేయడంలేదు?