న్యూవేవ్, సినిమా కథ, కథనంలో కొత్తదనం!
న్యూడ్‌వేవ్, అంగాంగ ప్రదర్శన, కథపరంగా అవసరంవున్నా లేకపోయినా
ఈ రెండు దశలూ అంతరించాయి. తాజాగా ‘వల్గర్ వేవ్’ బాక్సాఫీసుని ఏలుతోంది.
భాషని, సంస్కృతిని, భావజాలాన్ని భ్రష్టుపట్టిస్తున్న ఈ ‘వల్గర్ వేవ్’ ని అడ్డుకట్ట అవసరం!
భ్రష్ట పదజాలంతో హీరో విలన్‌ని తిట్టడం. హీరోయిన్లని హీరోలు టీజ్ చేయడం!
ఆ డైలాగుల్ని అభిమానులు తమ మొబైల్స్ రింగ్‌టోన్‌గా పెట్టుకోవడం.
థియేటరులోనేకాదు, పబ్లిక్‌గా కూడా ఆ తిట్లు వినలేక తల్లడిల్లిపోతున్న వారెందరో!
ఆ పదాలకు అర్ధాలు అడుగుతున్న పసివారికి సమాధానం చెప్పలేక తెల్లమొహాలేస్తున్న తల్లులు ఎందరెందరో!
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్, ఛైర్మన్‌గా టి. సుబ్బిరామిరెడ్డి వ్యవహరించిన కాలంలో భ్రష్ట భాషకి కత్తెరపడుతుందని ఆశించాం. కానీ జరగలేదు. భాషపరంగా హిందీలో 15, ఇంగ్లీషులో 13 తెలుగులో 30 అభ్యంతరకరమైన పదాలను పక్కనపెట్టనున్నారు : ఇది ఈ నాటికి కాదు 2003లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. కానీ కార్యరూపం దాల్చలేదు. త్వరలో ఈ ప్రతిపాదన అమలులోకి రానున్నది. నీ అమ్మ, నీ అక్క, బొక్క, నాయాల, తదితర అపభ్రంశాలు వినిపించవనే ఆశిద్దాం!
మాటలలోనేకాదు చేతలలోనూ అపభ్రంశాలు చోటుచేసుకుంటున్నాయి. వల్గారిటీ భాషలోనేకాదు దృశ్యరూపంగానూ దర్శనమిస్తోంది. కొన్ని భంగిమలు రతిభంగిమలకు దగ్గరగా వుంటున్నాయి. తెలుగురాని పరభాషా నాయికలకు వారేం మాట్లాడుతున్నారో, హీరో ఏమంటున్నాడో తెలియదు గనక ఇంతకాలం నడిచిపోయింది. కానీ పదునెక్కుతున్న సెన్సారు కత్తెరకి వేయికళ్ళు!
- తోటకూర రఘు