రామానాయుడికి తెలంగాణ సర్కారు ఘన నివాళి!!
ఇంతకాలం సీమాంధ్రులను అంటరానివారుగా, దోపిడీదారులుగా, దగాకోరులుగా అభివర్ణించిన టిఆర్‌ఎస్ కెసిఆర్ హఠాత్తుగా ‘‘సెటిలర్స్’’ అన్న పదాన్ని తన నిఘంటువు నుంచి తొలగించినట్లు మాట్లాడటం, రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలకడం సీమాంధ్రులను సంతోషపరిచింది.
ఇప్పటికీ చెన్నై వెళ్తే తెలుగు తేజాల విగ్రహాలు, కొన్ని వీధులకి, పార్కులకి, విద్యాలయాలకి తెలుగువారి పేర్లు కనిపిస్తాయి. ఒక్క తమిళనాడులోనే కాదు కర్ణాటక, ఒరిస్సాలో కూడా తెలుగువారు గౌరవింపబడుతున్నారు. కానీ, తెలంగాణలో సీమాంధ్రులపేరిట వున్న సంస్థల పేర్లు మార్చడం, ట్యాంకుబండ్‌పై వున్న విగ్రహాలు తొలగించడం సీమాంధ్రుల గుండెల్ని గాయపరిచింది. ఈ గాయాలకు లేపనం పూసే ప్రయత్నం చేయాలి కెసిఆర్.
ఇదే సమయంలో మరో ముఖ్య విషయం ప్రస్తావించాలి: సంచలనం కోసం, వార్తలలో కనిపించడానికి లగడపాటి రాజగోపాల్ తెలంగాణ వాదులను తన మాటలతో రెచ్చగొట్టేవారు. తాను మాత్రం పోలీసు రక్షణ పెట్టుకునేవారు. కానీ తెలంగాణలోని సీమాంధ్రులు ఇబ్బంది పడేవారు.
ఇప్పుడు సీమాంధ్రుల పట్ల కెసిఆర్ దృక్పధంలో మార్పు కనిపిస్తుంటే, చంద్రబాబు తెలంగాణలో పర్యచించనుండటం కొసమెరుపు.
-తోటకూర రఘు