భారతీయ సినిమా పరిశ్రమలో ఆయన అధిరోహించని శిఖరాలు లేవు. భారతీయ భాషలన్నిట్లో (13) సినిమాలు నిర్మించారు. రాశిపరంగా, వాసిపరంగా రికార్డులను తిరగరాశారు. స్టూడియో, లేబొరేటరీ, రికార్డింగ్ థియేటర్, ఔట్‌డోర్ యూనిట్, గ్రాఫిక్స్ డివిజన్ థియేటర్లు పంపిణీ, ఒకటనేమిటి చిత్ర నిర్మాణానికి సంబంధించిన అన్ని యూనిట్లను నెలకొల్పారు. తెలుగు సినిమా పరిశ్రమలోని నిన్నటితరం హీరో, హీరోయిన్లందరితో చిత్రాలు నిర్మించారు. ప్రతి హీరోకి తాను జీవితంలో గుర్తుంచుకోవదగ్గ సినిమాని ఇచ్చారు. సినిమాపరంగా ఆయన అందుకోని రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులేదు. ఆయన లెగసీని కంటిన్యూ చేసే కుమారులు సురేష్‌బాబు, వెంకటేష్, మనవళ్ళు రానా (రామానాయుడు), నాగ చైతన్య ఆయన కళ్ళముందే ఆయన ఆశించిన స్థాయికి ఎదిగారు. ‘రామానాయుడు వ్యక్తికాదు సంస్థ, ఓ వ్యవస్థ’ అన్న స్థాయిని అందుకున్నారు. ఆయన గురించి చెప్పుకోవడానికి చాలాచాలా వుంది. దాతృత్వం వున్న మహా మనీషి రామానాయుడు. రామానాయుడు ఎందరో దర్శకులను పరిచయం చేశారు. తన సంస్థలో పనిచేసిన అసోసియేట్స్‌ని ఆయన ప్రోత్సహించిన తీరు ఆయనకే సాధ్యం.
విబి రాజేంద్రప్రసాద్, అక్కినేని తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతుండగానే మరో పిడుగులాంటి వార్త : రామానాయుడు నిర్యాణం!
పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ఆయన మార్గం ఆదర్శనీయం, అధ్యయనీయం, అభినందనీయం!
-తోటకూర రఘు