‘అల్లరి’తో హీరోగా పరిచయమై ఎన్నో కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను నవ్విస్తూ 50 చిత్రాలకు చేరువవుతున్న అల్లరి నరేష్ తన తండ్రి ఇ.వి.వి.సత్యనారాయణ ప్రారంభించిన ఇ.వి.వి. సినిమా బేనర్‌లో ఆర్యన్ రాజేష్‌తో కలిసి నిర్మిస్తున్న మరో విభిన్నమైన కామెడీ చిత్రం ‘బందిపోటు’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ‘సినీజోష్’తో అల్లరి నరేష్ ఇంటర్వ్యూ.
‘బందిపోటు’ ఎలాంటి సినిమా?
ఈ బందిపోటు నిజాయితీగా సంపాదించుకున్న వారిని దోచుకోడు. అవసరానికి మించి అక్రమంగా ఎవరు డబ్బు సంపాదించారనేది హీరో రీసెర్చ్ చేస్తుంటాడు. వారి దగ్గర మాత్రమే దోచుకుంటాడు. అంటే దొంగల దగ్గర మాత్రమే దోచుకుంటాడు. ఇది ఒక కాన్ బేస్డ్ మూవీ. హాలీవుడ్‌లో కాన్ బేస్డ్ మూవీస్ చాలా వచ్చాయి. హిందీలో కూడా ఈమధ్య వచ్చాయి. కానీ, తెలుగులో ఇప్పటివరకు అలాంటి సినిమా రాలేదు. ఆ జోనర్ అయితే కొత్తగా వుంటుందని ట్రై చేశాం.
ఇంద్రగంటి కాంబినేషన్ ఎలా సెట్ అయింది?
ఆమధ్య కొన్ని ఆడియో ఫంక్షన్స్‌లో కలుసుకున్నప్పుడు మోహనకృష్ణగారి అత్తయ్య నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. అతనితో సినిమా చేస్తే బాగుంటుందని ఆమె అన్నారట. అయితే మాయాబజార్‌గానీ, అష్టాచెమ్మాగానీ, గోల్కొండ హైస్కూల్‌గానీ, అంతకుముందు ఆ తరువాతగానీ డిఫరెంట్ జోనర్ సినిమాలు. నా సినిమా అంటే ఆడియన్స్ డెఫినెట్‌గా కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కామెడీ జోనర్‌లోనే కొత్తగా చూపించే ప్రయత్నం చెయ్యాలనుకున్నాం. ఇది ఇప్పుడనుకున్నది కాదు. 2012లో సుడిగాడు రిలీజ్ అయిన టైమ్‌లోనే ఒక కథ చెప్పారు. ఆ తర్వాత రెండు, మూడు కథలు అనుకున్నాం. అప్పుడు ఈ కథ కూడా అనుకున్నాం. అయితే ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా కథ రాలేదు. ఈలోగా ఆయనకి అంతకుముందు ఆ తరువాత సినిమా వచ్చింది.
మీ ఇద్దరూ చేసే జోనర్స్ వేరు కదా. ఈ సినిమా ఎలా కుదిరింది?
అష్టాచమ్మా నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత మోహనకృష్ణగారితో సినిమా చెయ్యాలని అనుకున్నాను. ఆయనకి అర్బన్ సినిమాలు తీస్తారు, ఎ సెంటర్ సినిమాలు తీస్తారన్న పేరు వుంది. ‘నాకు బి, సి సెంటర్స్ స్ట్రాంగ్‌గా వుంటాయి. మీకు ఎ సెంటర్స్ స్ట్రాంగ్‌గా వుంటాయి. నేను నా ట్రెండ్ మార్చుకుంటాను, మీరు కూడా మీ ట్రెండ్ మార్చుకొని మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం’ అని ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందే చెప్పాను. అందుకే బందిపోటు అనే సినిమా ఎ, బి, సి సెంటర్ల సినిమా అనిపించేలా తియ్యడం జరిగింది.
ఈ తరహా సినిమా అన్ని సెంటర్స్ ఆడియన్స్‌కి రీచ్ అవుతుందా?
ఇది ఇంటెలిజెంట్ కామెడీతో చేసిన సినిమా. ఇలాంటి కామెడీ అందరికీ నచ్చుతుంది. బి, సి సెంటర్స్ వారికి కూడా బాగా అర్థమవుతుంది. అందుకే మోహనకృష్ణగారు, నేను అనుకునే ఈ తరహా సినిమా చేశాం. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా వుంటుందని చెప్పారాయన. నేను షాక్ అయ్యాను. మీరేంటి ఐటమ్ సాంగ్ ఏమిటి? నరేష్ మిమ్మల్ని మార్చేసాడనుకుంటారంతా అని సరదాగా అన్నాను. లేదండీ ఇందులో ఆ సిట్యుయేషన్ వుంది. దానికోసం ఐటమ్ సాంగ్ చెయ్యాలన్నారు. ఎక్కువ క్లాస్ అయినా నా ప్రేక్షకులకు నచ్చదు. సేమ్‌టైమ్ ఎక్కువ మాస్ అయినా ఆయన ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. కాబట్టి నేను ఆయన స్టైల్‌లోకి, ఆయన నా స్టైల్‌లోకి మారి చేసిన సినిమా ఇది. అలా అందరికీ రీచ్ అవ్వాలని చేస్తున్న ప్రయత్నంలో ఏయే అంశాలు వుండాలి అనేది పూర్తిగా డిస్కస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఈ సినిమా చేశాం. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒక తెలివైన వాడు మరో తెలివైన వాడిని మోసం చేస్తాడు. అంటే ఎత్తుకు పైఎత్తు వేస్తాడు. కాబట్టి ఇది అన్ని సెంటర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను.
హీరోయిన్ ఈష ఎంపిక ఎలా జరిగింది?
జనరల్‌గా మనం తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడంలేదు అంటుంటాం. అంతకుముందు ఆ తరువాత సినిమా కంటే ముందు ఎవరో నాకు పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నా సినిమాల్లో అందరూ కొత్త హీరోయిన్స్ అయిపోతున్నారని డైరెక్టర్‌గారికి చెప్పాను. అప్పుడు ఈష గురించి చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెలిజెంట్‌గా వుంటుంది. తెలుగమ్మాయి కాబట్టి ఆ క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పారు. అప్పుడు అంతకుముందు ఆ తరువాత సినిమా చూశాను. చాలా బాగా చేసింది. ఈ క్యారెక్టర్‌కి బాగుంటుందని ఆమెను సెలెక్ట్ చేశాం.
సంపూర్ణేష్‌బాబు క్యారెక్టర్ గురించి?
నేను హృదయ కాలేయం సినిమా చూడలేదు. ఒక ఆడియో ఫంక్షన్‌లో అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడడం చూశాను. ఆ తర్వాత ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందని మేం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఒక క్యారెక్టర్‌కి సంపూ అయితే బాగుంటాడనిపించింది. ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అవుతారనిపించింది.
ఫస్ట్ టైమ్ కళ్యాణి కోడూరి మీ సినిమాకి మ్యూజిక్ చేశారు. అతని వర్క్ ఎలా వుంది?
చాలా బాగా చేశారు. మెయిన్ నా సినిమాల్లో కామెడీ రన్ అవుతున్నప్పుడు పాటలు స్పీడ్ బ్రేకర్స్‌లా వుంటున్నాయని అందరూ చెప్తున్నారు. అందుకే ఇందులో నాలుగు పాటలే పెట్టడం జరిగింది. కళ్యాణిగారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మొదట నేను కొంత టెన్షన్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన మెలోడీ సాంగ్స్ ఎక్కువ చేస్తుంటారు. నరేష్ అంటే ఎక్కువ ఎనర్జీ వుండే సాంగ్స్ చెయ్యాలి, డాన్స్ చేసే సాంగ్స్ చెయ్యాలి అని ఆయన కూడా టెన్షన్ ఫీల్ అయ్యారు. అయితే ఇందులో ఎక్కువగా డాన్స్ చెయ్యాల్సిన పాటలు లేవు అని చెప్పాం. దానికి తగ్గట్టుగానే ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశారు.
‘బందిపోటు’ ఇ.వి.వి. సినిమా బేనర్ స్టాండర్ట్స్‌ని రీచ్ అయ్యేలా వుంటుందా?
డెఫినెట్‌గా రీచ్ అవుతుంది. ఈ బేనర్‌ని మళ్ళీ ఓపెన్ చేశాం. నాన్నగారు ఎలాంటి మంచి సినిమాలు తీశారో మేం కూడా ఆ స్టాండర్డ్ తగ్గకుండా చెయ్యాలనే స్టార్ట్ చేశాం. నాన్నగారి బేనర్‌లో చేస్తున్నామంటే ఆ స్టాండర్డ్స్‌లోనే సినిమా వుండాలి. నాన్నగారు సినిమా పబ్లిసిటీకి బాగా ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు సినిమా తియ్యడం ఒక ఎత్తయితే పబ్లిసిటీ చెయ్యడం మరొక ఎత్తు. సినిమా ఎంత బాగా తీసినా చివరికి పబ్లిసిటీ దగ్గరకి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నా ప్రీవియస్ మూవీస్ కొన్ని ఏవరేజ్‌గా వున్నప్పటికీ సరైన పబ్లిసిటీ లేకపోవడంవల్ల ఫ్లాప్ అయ్యాయి. నాన్నగారు రెండే రెండు రూల్స్ పెట్టారు. పబ్లిసిటీ బాగా చెయ్యాలి, పేమెంట్స్ ఎప్పుడూ ఆపకూడదు. మొదటి నుంచీ అలాగే చేస్తూ వచ్చారు నాన్నగారు. ఫస్ట్ తారీఖున పేమెంట్ ఇవ్వాలంటే 31నే పేమెంట్ అయిపోవాలి. అందుకే సినిమా స్టార్ట్ చెయ్యకముందే బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకొని సినిమా స్టార్ట్ చేశాం.
ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు?
ఓవర్సీస్‌తో కలిపి టోటల్‌గా 400 థియేటర్స్‌లో రిలీజ్ చెయ్యాలన్నది ప్లాన్. నైజాంలో 95 థియేటర్స్‌లో చేస్తున్నాం.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్?
ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా జరుగుతోంది. శ్రీనువైట్ల దగ్గర కోడైరెక్టర్‌గా చేసిన సాయికిషోర్‌గారు డైరెక్ట్ చేస్తున్నారు. 60 శాతం కంప్లీట్ అయింది. మార్చి 1కి టాకీ పూర్తవుతుంది. ఏప్రిల్ వరకు సాంగ్స్ చేస్తాం. ఆ తర్వాత ఒక నెల గ్యాప్ తీసుకొని నా 50వ సినిమా స్టార్ట్ చేస్తాం. దానికి రెండు మూడు కథలు అనుకున్నాము కానీ ఏదీ ఫైనల్ అవ్వలేదు. 52వ సినిమా ఓపెన్ అయిపోయిందిగానీ, 50వ సినిమా కావడంలేదు. ఎందుకంటే ఒక యాక్టర్‌గా నాకూ అది మైల్‌స్టోన్‌లాంటి సినిమా. అది స్పెషల్‌గా వుండాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు అల్లరి నరేష్.