>‘ఇండో-పాక్’ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా భారత ప్రధాని మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి ఫోను చేయడాన్ని జమ్ము కాశ్మీరు - పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ హర్షం వెలిబుచ్చారు. ఇదే సందర్భంగా పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు అందజేస్తూ భారత సారధి దోని దూకుడుని తాను క్రికెట్ మైదానంలో ఇష్టపడతానని పేర్కొనడం ముదావహం.
>ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు - తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నరు సమక్షంలో కృష్ణానదీ జలాల వివాదానికి తెరదించుతూ ఒక ఒప్పందానికి రావడం రాజకీయ విశ్లేషకులనే కాదు, రైతులనూ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.
>కర్నూలులో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకి కేంద్రం 125 కోట్లు ఇవ్వజూపడం, నెల్లూరులో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి 45 కోట్లు మంజూరు చేయడం శుభపరిణామం.
>న్యూజిలాండ్ -శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విలియమ్స్ కొట్టిన భారీ సిక్సర్‌ని స్టేడియంలో ఉన్న భారత సంతతికి చెందిన క్రికెట్ అభిమాని గండ సంజయ్ ఒంటి చేత్తో క్యాచ్‌పట్టాడు. ఇలా పట్టిన క్యాచ్‌లకు ఓ స్పాన్సర్ కంపెనీ కోటి పదహారు లక్షలు బహుమతి ప్రకటించింది. ప్రపంచకప్ విజేత ఎంపికనాటికి ఇలా ఎంతమంది ప్రేక్షకులు క్యాచ్‌లు పడితే వారందరికీ ఈ బహుమతి మొత్తాన్ని పంపిణీ చేస్తారు. ఏదేమైనా మనోడు మైదానం బయట, గ్యాలరీలో కూర్చొని పట్టాడండీ సిక్సర్.
>-తోటకూర రఘు