తెలుగు టివి ఛానల్స్, పాటను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం, అధ్భుతం, ఆచరణీయం! ఆ ఛానల్స్ యాజమాన్యానికి, కార్యక్రమ ప్రయోక్తలకు సంగీత అభిమానులు శిరసువంచి నమస్కరించాల్సిందే! అయితే, దాదాపుగా అర్ధ శతాబ్దంపాటు తెలుగు సినిమాపాటకు పల్లవిగా భాసించిన ఘంటసాల వారు సంగీత దర్శకునిగా, గాయకునిగా చేసిన కృషిని యువతరానికి అర్ధమయ్యేలా బుల్లి తెర వేదికగా చెప్పవలసినంతగా చెప్పడంలేదని నా వ్యక్తిగత అభిప్రాయం. పద్యనాటకం తెలుగువాడి సొత్తు. ఘంటసాల వారితోనే పద్యమూ కనుమరుమగుతోంది. బాల సుబ్రహ్మణ్యం లేకపోతే , రాఘవేంద్రరావు ‘అన్నమయ్య, రామదాసు, పాండురంగడు, సాయిబాబా’ జీవితాలను తెరకెక్కించకపోతే, పద్యం పూర్తిగా అదృశ్యమయ్యేదే!
సుబ్బరామన్, ఘంటసాల, ఆదినారాయణ, మల్లాది తదితరులను సందర్భోచితంగా యువతరానికి పరిచయం చేయాలి. కొన్ని ప్రైవేటు పాటలున్నాయి. వాటినీ వెలుగులోకి తీసుకురావాలి.
టివి ఛానల్స్ వలనే పాత పాటకి, ఆ పాటల వలన ఆ సినిమాలకి ఎనలేని పాపులారిటీ , ఈ తరంలో వస్తోందనడం నిర్వివాదాంశం. కానీ, సుబ్బరామన్ , ఘంటసాల వారు ప్రాత:స్మరణీయులు సినీ సంగీత ప్రియులకి. వారి ప్రస్తావనలేని సినీ సంగీత కార్యక్రమాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.
-తోటకూర రఘు