తెలుగులో సుమారు 90 కి పైగా చిత్రాలలో నటించి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో రాజశేఖర్. ఈ మధ్య కాలంలో ఆయన హీరోగా సక్సెస్ రుచి చూసి చాలా రోజులు అయింది. దీంతో హిట్ కొట్టే ప్రయత్నంలో తమిళ్ చిత్ర రీమేక్ ని ఆయన ఎంచుకున్నాడు. శివాని, శివాత్మిక మూవీస్ ఆధ్వర్యంలో జీవిత రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పేరు 'గడ్డం గ్యాంగ్'. ఫిబ్రవరి 6 న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
- 'గడ్డం గ్యాంగ్' ఎలా ఉండబోతోంది?
ఈ సినిమా లో నా క్యారెక్టర్ నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఒక హ్యుమరస్ క్యారెక్టర్. ఈ సినిమాలో గడ్డం గ్యాంగ్ కిడ్నాపింగ్ కి కొత్త నిర్వచనం చెప్తారు. డైరెక్టర్ సంతోష్ కి ఇది మొదటి సినిమా కాని చాలా అనుభవం ఉన్నట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్ షీనా చాలా బాగా నటించింది. ఈ సినిమా లో ఆమె పాత్ర ప్రేక్షకులకు సర్ప్రైసింగ్ గా ఉంటుంది.
- తెలుగులో నేరుగా సినిమా తీయకుండా రీమేక్ సినిమాని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం?
తమిళంలో ఈ సినిమా చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా నేనే రీమేక్ చేయాలనే ఉద్దేశ్యంతో రైట్స్ కోసం చాలా రోజులు తిరిగాను. చివరగా ఈ చిత్రం రైట్స్ నాకే వచ్చాయి. ఈ సినిమా రొటీన్ వాటికి భిన్నం గా ఉంటుంది. ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది.
- ఈ చిత్రంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసారా?
అలా ఏమి చేయలేదు కాని ఇంకా బెటర్ గా తీయడానికి ప్రయత్నించాం.
- ఈ చిత్రానికి ఏవి హైలైట్స్ గా నిలుస్తాయి అనుకుంటున్నారు?
చిరంజీవి ఫ్యామిలీ కి మాకు కొంచెం గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అవేవి పట్టించుకోకుండా నాగబాబు గారు ఈ చిత్రం లో నటించారు. ఈ చిత్రంలో ఆయన చేసిన క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తుంది. ఆడియోకి కూడా మంచి టాక్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు చాలా బాగా స్వరాల్ని సమకూర్చారు. రెండు పాటలు చాలా అధ్బుతంగా ఉన్నాయి.
- మీ క్యారెక్టర్ కి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా?
ట్రైలర్ తీసే సమయంలో సాయికుమార్ అవైలబుల్ గా లేకపోవడంతో నా పిల్లల ఫోర్స్ తో నేనే డబ్బింగ్ చెప్పాను. 'గడ్డం గ్యాంగ్' సినిమాని నేను చాలా ఇష్టపడి చేశాను. అలాంటి సినిమాలో రిస్క్ చేయలేక సినిమా అంతా సాయికుమార్ తోనే డబ్బింగ్ చెప్పించాం.
- ఈ సినిమా తరువాత ప్లాన్స్ ఏంటి?
'వంద కి వంద' అనే షూటింగ్ ఎనబై శాతం పూర్తయింది. 'గడ్డం గ్యాంగ్' సినిమా కోసం ఈ చిత్రం షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చాము. అది కాకుండా రామ్ గోపాల్ వర్మ తో చేసిన 'పట్టపగలు' , కన్మణి దర్శకత్వం లో 'అర్జున' సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అవి రిలీజ్ అయ్యాక ఈ సంవత్సరంలో ఎక్కువ మూవీస్ రిలీజ్ చేసిన హీరో నేనే అవుతాను(నవ్వుతూ..)
- హీరోగానే కంటిన్యూ చేస్తారా?
హీరోగానే నటిస్తాను అనడం స్టుపిడిటి అవుతుంది. నెగెటివ్ రోల్స్ చేయడానికి కూడా నేను సిద్ధం గా ఉన్నాను. హీరోగా కాకుండా మంచి పాత్రలలో నటించడానికి అవకాశం వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే రాజశేఖర్ కి సక్సెస్ లేకపోవడం వల్లే సైడ్ రోల్స్ చేస్తునారు అని అంటారు. అందుకే హీరోగా మళ్ళీ సక్సెస్ తెచ్చుకున్నాకే వేరే పాత్రల్లో నటించాలని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఖచ్చితంగా ఇది పెద్ద సక్సెస్ అవుతుంది.
- మీరు నటించిన సినిమాలలో సీక్వెల్ చేయాలనుకుంటే ఏ సినిమాలను చేస్తారు?
నేను నటించిన చిత్రాలలో నాకు నచ్చినవి చాలా ఉన్నాయి. కాని మళ్ళీ తెరకెక్కించాలి అనుకునే చిత్రాలలో మొదటగా తలంబ్రాలు, ఆహుతి సినిమాలు ఉంటాయి.అంటూ ఇంటర్వ్యూ ముగించారు