ఫ్యామిలీ హీరోగా, యాక్షన్ హీరోగా అన్నిరకాల సినిమాలు చేస్తూ మధ్య మధ్య ప్రయోగాత్మక చిత్రాలూ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో విక్టరీ వెంకటేష్. తెలుగులో మల్టీస్టారర్స్ కరువైపోయిన ఈరోజుల్లో కమల్‌హాసన్‌తో ‘ఈనాడు’, మహేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలు చేసి మళ్ళీ మల్టీస్టారర్ మూవీస్‌కి శ్రీకారం చుట్టిన వెంకటేష్ లేటెస్ట్‌గా పవన్‌కళ్యాణ్‌తో కలిసి చేసిన మరో మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్‌తో ‘సినీజోష్’ ఇంటర్వ్యూ.
ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి చేశారు. అతని క్యారెక్టర్ ఎలా వుంటుంది?
మేమిద్దరం కలిసి పది సంవత్సరాల క్రితమే ఓ సినిమా చేద్దామనుకున్నాం. అప్పట్లో మేమిద్దరం మా ప్రాజెక్ట్స్‌తో బిజీగా వుండడం వల్ల కుదరలేదు. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ సినిమాలో నేను ఒక కామన్ మేన్ క్యారెక్టర్ చేస్తున్నాను. గాడ్‌గా నటించాలంటే ఒక మంచి ఇమేజ్ వున్న హీరో అయివుండాలి. అతను చెప్పేది ప్రజలు వినాలి. అందుకే పవన్‌కళ్యాణ్‌తో చెయ్యడం జరిగింది. ఇది పవన్‌కి యాప్ట్ ఫిలిమ్ అని నేననుకుంటున్నాను. తన క్యారెక్టర్‌ని చాలా బాగా చేశాడు. రెగ్యులర్‌గా వచ్చే కమర్షియల్ ఫిలిమ్‌లా కాకుండా అతని బాడీ లాంగ్వేజ్‌లో కూడా చాలా డిఫరెన్స్ వుంటుంది. ఇప్పటి వరకు అతను చేసిన మంచి రోల్స్‌లో ఇదొకటి.
అనూప్ మ్యూజిక్ ఎలా వచ్చింది?
ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ అవసరమో అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. మూఢ నమ్మకాల మీద వచ్చే పాట, భగవద్గీత మీద పాట చాలా అద్భుతంగా వచ్చింది. పవన్‌కళ్యాణ్‌తో చేసిన భజే భజే పాట చాలా బాగా వచ్చింది. అలాగే రీరికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. తనకి కూడా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఒక డిఫరెంట్ మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చేసి టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే అవకాశం అతనికి వచ్చింది. ఎన్నో మంచి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన అనూప్ ఈ సినిమాకి ది బెస్ట్ మ్యూజిక్ చేశాడు.
ఇద్దరు స్టార్స్ ఈ సినిమాలో కలిసి చేశారు. ఫ్యాన్స్‌ని ఎలా శాటిస్‌ఫై చేయబోతున్నారు?
నేను ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను, పవన్ ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడనే విషయంలో ఫ్యాన్స్ చాలా క్లియర్‌గా వున్నారు. అందులో కాంపిటిషన్ ఏమీ లేదు. రెగ్యులర్‌గా వచ్చే కమర్షియల్ సినిమా కాదు. ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఒక కామన్ మ్యాన్ దేవుడి మీద కేసు వేస్తాడు. ఈ విషయంలో క్లారిటీ వుండడం వల్ల ఒక కొత్త తరహా సినిమా చూస్తున్నామని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు.
ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్?
ఈ స్క్రిప్ట్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. ప్రతి సీన్ చాలా బాగా వచ్చింది. పర్టిక్యులర్‌గా ఒక సీన్ గురించి చెప్పాలంటే కష్టం. ఇందులో నా క్యారెక్టరే చాలా విభిన్నంగా వుంటుంది. దేవుడి మీద కేసు వేస్తాను. దాంతోనే తెలిసిపోతుంది కదా నా క్యారెక్టర్ ఎలాంటిదో. ఇది ఒక విభిన్నమైన సబ్జెక్ట్ కావడంవల్ల ప్రతి సీన్ విభిన్నంగానే వుంటుంది. ప్రతి సీన్ అందరికీ నచ్చేలా వుంటుంది.
బాలకృష్ణ, నాగార్జునలాంటి హీరోలతో కూడా కలిసి చేస్తారా?
తప్పకుండా చేస్తాను. నేను ఇంతకుముందే చెప్పాను ఎవెంజర్స్‌లాంటి సినిమా చెయ్యాలని. పది మంది హీరోలు వరసగా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో వుండే పోస్టర్ వేస్తే ఎలా వుంటుంది? పది మంది కలిసి ఒక సినిమా చేస్తే ఒక్కొక్కరికి పది నిముషాల క్యారెక్టర్ వుంటుంది. ఎవరికి ఎంత క్యారెక్టర్ వుందీ, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు అనేది ఆలోచిస్తే ఎలా? అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి.