నాడు యాదవ వంశంలో ముసలం; నేడు కమ్మ...కుమ్ములాట!!
రాజధాని కమ్మవారిది 'సిగపట్ల గోత్రం'!
నిన్నటివరకు కృష్ణాజిల్లా 'కమ్మ' సామాజిక వర్గానికి ప్రత్యేకించి కాంగ్రెసు పార్టీకి దన్నుగా నిలిచిన దేవినేని రాజశేఖర్ అనబడు 'నెహ్రూ' చుట్టూ వుండే 'నెహ్రూకుర్రాళ్ళు ' నేడు కృష్ణాజిల్లా టిడిపి నాయకుడు - రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చుట్టూ చేరడం ; ఆయన ఎక్కడకు వెళ్ళినా కాన్వాయ్ లా అనుసరించడం చాలామందికి మింగుడుపడటం లేదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేనిరోజునా, తిరిగి అధికారానికి వచ్చిన ఈ అల్పకాలంలోనూ దేవినేని ఉమా చుట్టూ కృష్ణాజిల్లా రాజకీయం తిరుగుతోంది. నిన్నటివరకు దేవినేని నెహ్రూ చుట్టూ వున్నా 'నెహ్రూ కుర్రాళ్ళు' నేడు దేవినేని ఉమా చుట్టూ చేరిపోయారు. జిలా పార్టీ యంత్రాంగం పై పట్టు బిగించి మంత్రిగా అధికారం చెలాయిస్తున్న దేవినేని ఉమా ఎత్తులకు టిడిపి జిల్లా నాయకులు చిత్తయిపోతున్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, యలమంచలి రవి వంటి వారు ఉక్కబోత అనుభవిస్తున్నారు. కొడాలి నాని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నాడు. దాసరి బాలవర్ధనరావు సరేసరి. వంశి, బోడే ప్రసాద్ వంటి ఎమ్మెల్యేలు సంఖ్యాబలంగా మిగిలిపోయారు. పార్ధసారధి మంత్రిగా వున్నంతకాలం దేవినేని ఉమా ఆరోపణలతో సవాళ్లు విసిరేవారు. కానీ దేవినేని ఉమా మంత్రి అయినా సారధి ఆరోపణల అస్త్రశస్త్రాలు సంధించడానికి సాహసించలేకపొతున్నారు. కానీ విజయవాడ ఎంపీ కేసినేని మాత్రం బహిరంగ వేదికపై ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేసారు. సిపిని, మంత్రివర్యులను కడిగిపారేశారు. సరిగ్గా ఇదే సమయంలో యలమంచిలి రవి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వ్యవహార శైలిని పత్రికాముఖంగా తూర్పారబట్టారు. కృష్ణా - గుంటూరు - ప్రకాశం జిల్లాలలోని కమ్మ సామాజిక వర్గం అధిక సంఖ్యాకులు తెలుగుదేశం పార్టీ కి కొమ్ముకాచారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన విజయవాడ పారిశ్రామికవేత్తలు ఎన్నికల ముందు 'విజనరీ లీడర్ కావాలి; విశ్వసనీయత వున్న నాయకుడ్ని ఎంచుకోవాలి' అంటూ పరోక్షంగా చంద్రబాబుకి ప్రచారం చేశారు. అధికారం వచ్చిన తర్వాత దేవినేని ఉమాకి దీటుగా కామినేని శ్రీనివాస్ పవరుసెంటరుగా ఎదుగుతున్నారు. అధికారానికి వచ్చి ఆర్నెల్లు దాటింది; కుమ్ములాటలూ ఆరంభమయ్యాయి. కృష్ణాజిల్లా రాజకీయం దేవినేని వారి గడప దాటకపోవడం విశేషం.
-తోటకూర రఘు