'అన్నమయ్య' ప్రేక్షకుల సందేహాలకు దర్శకుని వివరణ కావలి!
'అన్నమయ్య' సినిమాలో అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని దర్శించడానికి బయల్దేరతాడు. మార్గమధ్యంలో ఎన్నో అవాంతరాలు. స్వామిదర్శనంకానిదే పచ్చిగంగానయినా ముట్టనని ప్రతిన బూనతాడు. తోటి ప్రయాణీకులు నిక్షేపంగా స్వామివారి దర్శనానికి వెడితే మాత్రం ముందుకు సాగాలేకపోతాడు. అప్పుడు స్వయాన పద్మావతీ అమ్మవారే స్వామివారు ఆరగించగా మిగిలిన 'లడ్డు'తో అన్నమయ్య దగ్గరకు వస్తారు. ఆ ఏడు కొండల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, ' సాలగ్రామ' మయమయిన ఆ కొండలపై చెప్పులతో నడవరాదని చెబుతారు. వెంటనే పశ్చాత్తాపంతో ఆ చెప్పులు విడిచి పెడతాడు అన్నమయ్య.
- అన్నమయ్యలో రాఘవేంద్రుడు చెప్పిన ఈ విషయం మమ్మల్ని పశ్చాత్తాపంతో దహించేస్తోంది: కొండపై చెప్పులతో తిరిగినందుకు. నాబోటి భక్తులు ఎందరెందరో కొండపై చెప్పులతో తిరుగుతున్నారు.
ఈ విషయమై రాఘవేంద్రరావు గారు సేకరించిన సమాచారం ఏమిటి? జీయర్ స్వామీజీ శిష్యుడయిన రాఘవేంద్రరావు ఈ విషయమై జీయర్ స్వామీజీ సలహా తీసుకున్నారా?
శైవుడయిన 'అన్నమయ్య' - స్వామి సన్నిధిలో విష్ణు భక్తుడుగా మారినవైనాన్ని నుదుట బొట్టుమారడంతో చూపించారు. బాగుంది. అన్నమయ్య పెళ్లి ఎపిసోడ్ లో పూజారిగా వచ్చిన శ్రీవేంకటేశ్వరుని నుదుట విభూతిరేఖలు చూపించడంలోని ఔచిత్యమేమిటో రాఘవేంద్రరావు గారి నుంచి తెలుసుకోగోరుతున్నాం.
'అన్నమయ్య'లో దర్శకుని మేధోమధనాన్ని మా ముందించిన అంశం
అన్నమయ్య భార్యలు ఇరువురూ పరమపదించే సన్నివేశం : సర్వసంగ పరిత్యాగి - ఋషి; భవబందాలను త్రెంచుకున్న వాడు అని చెప్పడానికి కాబోలు అన్నమయ్య పులితోలుపై కూర్చున్నట్టు చూపించారు.
దర్శకుని కోణంనుంచి ఆ సన్నివేశ రూప కల్పన తెలుసుకోగోరుతున్నాం!
ఒక దర్శకుని సెట్ ప్రాపర్టీస్ పైన ఎంతటి అవగాహన వుంటుందో - సెట్ ప్రాపర్టీస్ తో కూడా కథ చెప్పవచ్చ అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చా?
ముక్తాయింపు: సాధారణంగా రాఘవేంద్రరావు హీరోయిన్ల బొడ్డుమీద పూలు, పళ్ళతో కొడతారు. కానీ 'బొంబాయి ప్రియుడు' లో రంభని శంఖంతో కొట్టారు దర్శకేంద్రుడు.
- తోటకూర రఘు