అవును.. వైసీపీ హయాంలో సకల శాఖా మంత్రిగా వ్యవహరించిన, 2024 ఎన్నికల్లో ఘోర ఓటమికి ప్రధాన కారకుడైన సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయా..? కనీసం ఆ ప్రయత్నం అయినా చేయడానికి అధినేత సాహసం చేస్తారా? అవన్నీ ఎందుకు పక్కన పెట్టాలనే ఆలోచన అస్సలు వస్తుందా..? అంటే అసాధ్యం అనే మాటలు కార్యకర్తలు, అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇదీ అసలు సంగతి..
వైఎస్ జగన్ మూడు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా ప్రజాదర్భార్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఐతే ఈ సందర్భంగా జగన్ రెడ్డికి ఊహించని రీతిలో, ఖంగుతినేలా ప్రశ్నలు ఇంకా చెప్పాలంటే వైసీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు నిగ్గదీసి అడిగారు. ఎందుకంటే ఆయనతో నియోజకవర్గ ప్రజలకు సాన్నిహిత్యం కూడా అంతలా ఉంటుంది. గురువారం నాడు ప్రజాదర్భార్ కార్యక్రమంలో సజ్జల ప్రస్తావన వచ్చింది. చేసిందంతా సజ్జల.. ఇవాళ ఓడిపోయి ఈ స్థితిలో ఉన్నందుకు కారకుడు ఆయనే? ఇంకా పార్టీలో, ముఖ్యంగా పక్కనే ఎందుకు పెట్టుకున్నారు? ఇంకెన్నాళ్ళు ఆయన్ను భరించేది? అని జగన్ రెడ్డిని నియోజక కార్యకర్తలు నిలదీశారు. ఈ క్రమంలో ఈ ప్రశ్నలు సంధించిన వారివైపు ఆశ్చర్యపోతూ చూశారు (నవ్వుతూ, తల ఊపి). అదేమీ లేదబ్బా..? అన్నీ సర్దుకుంటాయి.. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిచేది వైసీపీనే అని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది.
అస్సలు అయ్యే పనేనా..?
వైఎస్ జగన్ లోగుట్టులన్నీ తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి సజ్జల అన్నది ఆ పార్టీలో ఎవర్ని అడిగినా ఈ విషయం పూసగుచ్చినట్టుగా చెబుతుంటారు. జగన్ కుటుంబానికి ఆప్తుడిగా, ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి వ్యాపారాల్లో నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తి సజ్జల. అందుకే పార్టీ పెట్టిన తర్వాత, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత ప్రాధాన్యత ఇచ్చారు జగన్. పాత్రికేయుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సజ్జల తన జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. జగన్ మీడియాను ఒంటి చేత్తో నడిపించిన వ్యక్తి. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీ వ్యాపారాలు అన్నీ తానై చూసుకున్నారు. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా బయటికి కనిపించలేదు కానీ తెర వెనుక అన్నీ నడిపించారు. 2014లో వైసీపీ ఓటమి తర్వాత అటు పార్టీ వ్యవహారాలు.. ఇటు పత్రిక వ్యవహారాలను సమన్వయం చేయడం కష్టం కావడంతో ఆయన పూర్తిగా పార్టీ పనులకు పరిమితం అయ్యారు.
ట్రబుల్ షూటర్‌గా..!
అలా 2019 ఎన్నికల్లో గెలిచాక క్యాబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ సలహాదారు పదవి వరించింది. అప్పటినుంచి పార్టీలో ట్రబుల్ షూటర్‌గా, ముఖ్యమంత్రి తరపున ఆయన ఆలోచనలు, ఆదేశాలను అమలు చేయడం, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో సజ్జల సక్సెస్ అయ్యారని ఆయన దగ్గరి మనుషులు చెబుతుంటారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా, ముఖ్యమంత్రి తరపున ఆయన ఆలోచనలు, ఆదేశాలను అమలు చేయడం, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో సజ్జల కీలక పాత్ర పోషించేవారు. జగన్ మనసులోని మాటను ఈయన ఆచరణలో పెట్టేవారని కొందరు వైసీపీ నేతలు చెబుతుంటారు.
అప్పట్లో ఇలా..
కడప జిల్లా.. పైగా ఒకటే సామాజికవర్గం, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పటి నుంచి నేటి వరకూ కష్టాల్లో, నష్టాల్లో అన్నింటిలో తోడై నిలిచిన వ్యక్తి సజ్జల. ఎలా అంటే వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యాక నా అనుకున్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరూ తోడుగా లేరు. వైఎస్ ఫ్యామిలీకి అండగా నిలిచిన వారెవరు అంటే వేళ్ళతో లెక్క పెట్టవచ్చు. వీరిలో సజ్జల ఒక్కరు. జగన్ అరెస్ట్ అయ్యాక మరుక్షణం వైఎస్ ఫ్యామిలీ రోడ్డున పడింది. అప్పుడే సజ్జల అనే వ్యక్తి ఒకరు ఉన్నారన్నది బయటికి వచ్చింది. నాటి నుంచి జగన్ వ్యాపారాలు, పత్రిక.. టీవీ ఛానెల్ అన్నీ చూసుకున్నారు. జైల్లో జగన్ రెడ్డితో వారంలో ఒకటి రెండు రోజులు ములాఖాత్ కావడం, పార్టీ వ్యవహారాలకు సంబంధించి అన్నీ మాట్లాడి.. ఆచరణలో పెట్టడం అన్నీ చూసుకున్నారు. ఐతే తెరపైకి రాకుండానే అన్నీ చేశారు. నాటి నుంచి నేటి వరకూ జగన్ ఫ్యామిలీతోనే సజ్జల ఉన్నారు. అందుకే జగన్ రెడ్డి.. సజ్జలను వదులుకోలేదు అని కొందరు నేతలు చెబుతున్న మాట.
మార్పు వచ్చినా?
వైఎస్ ఫ్యామిలీతో సజ్జలకు ఉన్న బంధం, కష్ట కాలంలో తోడుగా ఉన్న వ్యక్తులను జగన్ దూరం చేసుకోరని.. ఒకవేళ తప్పులు, ఒప్పులు ఉంటే మార్చుకోమని చెబుతారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు అని అధినేత అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. అందుకే.. వైసీపీలో కొందరు కార్యకర్తలు.. గెలిచినా, ఓడినా ఎప్పుడూ జగనన్నకు తోడుగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటున్నారని అందుకే మేము సైతం ఆయనతోనే అని మరికొందరు నేతలు, కార్యకర్తలు గట్టిగానే చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లోపు అయినా ఆయనలో కాసింత మార్పు వస్తుందేమో చూడాలి మరి.