అదేదో అంటారే.. ఒక్కసారి కోలుకోలేని దెబ్బ తగిలితేగానీ, దెయ్యం వదలదు అని. అచ్చంగా అలా ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగానే తెలిసొచ్చినట్టు ఉంది. అందుకే దెబ్బకు క్యాడర్, జనం, నేతలు అంటూ బయటికి వస్తున్నారు. ఇన్నాళ్లు తాడేపల్లి, బెంగళూరు ప్యాలస్ లకే పరిమితం అయిన జగన్ ఇప్పుడు బయటికి రావడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని వైసీపీ సోషల్ మీడియా హడావుడి మొదలు పెట్టింది.
ఇంతకీ ఏంటి మ్యాటర్?
వైసీపీ కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా చెబుతున్న మాటలు ప్రకారం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వచ్చాయి. జనవరి 3వ వారంలో జనంలోకి జగన్ వస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని సమాచారం. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానంలో 2 రోజులపాటు సమీక్షలు నిర్వహిస్తారని కార్యకర్తలు చెబుతున్నారు. ఇలా 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటన ఉంటుందట. ఈ సందర్భంగా వైసీపీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు, సలహాలు కూడా జగన్ తీసుకోనున్నారట.
నాడు తండ్రి.. నేడు తనయుడు!
వైఎస్ఆర్ హయాంలో ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే వచ్చిన వాళ్ళను వచ్చినట్టే కలిసేవారు. వారి అవసరాలు ఏంటి..? ఎందుకు వచ్చారు..? అని ఇంట్లో ఉంటే ఇంట్లోనే.. సచివాలయానికి వస్తే అక్కడే మాట్లాడేవారు. దీంతో ఆయన్ను ప్రజల మనిషి, ప్రజా శ్రేయస్సు కోరే నేత అంటూ జనం పిలుచుకునేవారు. ఐతే ఇప్పుడు జగన్ కూడా అలానే చేయాలని భావిస్తున్నారు అని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఇకపై తాడేపల్లిలో జగన్ రెడ్డిని కలిసేందుకు కార్యకర్తలు, అభిమానులు, నేతలు ఎవరు వచ్చినా సరే.. ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా కలుస్తారని ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి.
ప్రత్యేక ఏర్పాట్లు..!
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. తనను కలవడానికి ఎవరు వచ్చినా.. కార్యకర్తలు మొదలుకుని నేతలు, అభిమానులు ఎవర్ని వెనక్కి పంపకూడదని సిబ్బందికి క్లియర్ కట్ ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా ఇలానే జగన్ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంచుమించు ఓదార్పు యాత్ర, పాదయాత్ర లాంటిది అని నేతలు చెప్పుకుంటున్నారు. పర్యటనలో భాగంగా కార్యకర్తలపై కేసులు, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తారని తెలుస్తోంది.
హమ్మయ్య..!
మొత్తానికి చూస్తే.. జగన్ రెడ్డికి ఎవరైనా చెప్పడం వల్ల తెలిసిందో లేకుంటే స్వయంగా తెలుసుకున్నారో కానీ గట్టిగానే హితబోధ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ మోనార్క్, ఎవరి మాట వినరు, అస్సలు లెక్కచేయరు.. పట్టించుకోరు..? కనీసం కలవడానికి కూడా ఒప్పుకోరు అన్నది పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు ఉన్న అతి పెద్ద ఆరోపణలు. ఎందుకంటే ఇప్పటివరకూ జగన్ చుట్టూ ఉన్న కోటరీ దెబ్బకు ఎంత కార్యకర్తలు, నేతలు, ఆఖరికి ఎమ్మెల్యేలు సైతం జగన్ రెడ్డిని నేరుగా కలవడానికి వీలు అయ్యేది కాదు. తాజా నిర్ణయం నిజమే ఐతే మాత్రం వైసీపీ 2.0, జగన్ 2.0 ను చూడొచ్చు ఏమో మరి. ఏం జరుగుతుందో చూడాలి..!