విశాఖ ఉక్కుకు ఊపిరిపోస్తారా.. వదిలేస్తారా.?
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదం త్వరలో కనుమరుగు కానుంది..! ఉక్క హక్కు ఎవరిపాలు కానుందో తెలియని పరిస్థితి..! ఒకప్పుడు విశాఖ వేదికగా నిరసనలు చేసి.. 32 మంది చనిపోయిన తర్వాత సాధించుకున్న ఉక్కు.. ఇప్పుడు ప్రయివేటు పరం కావడానికి సమయం ఆసన్నమైంది..! మరోవైపు స్టీల్ ప్లాంట్ మూసివేతకు రంగం సిద్ధం అయ్యిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది.
మూసివేత దిశగా..!
విశాఖ విశాఖ స్టీల్ ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్-3ని యాజమాన్యం మూసివేయడం జరిగింది. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్-1 మూసివేయాగా.. ఇక మిగిలిన చివరి బ్లాస్ట్ ఫర్నేస్-2 కూడా త్వరలో మూసివేస్తారనే ప్రచారం జోరు అందుకుంది. ఐతే.. విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించిన తర్వాత రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు మూసి వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనిపై స్టీల్ ప్లాంట్ యూనియన్లు, ఉద్యోగులు గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. ఐతే.. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. ఎందుకు ప్రభుత్వం ఇలా మౌనం పాటిస్తోంది..? ఈ మౌనానికి కారణం ఏంటి..? అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక ఏపీలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితం విశాఖ ఉక్కుకు ఇంత కర్మ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై నోరు మెదపరా..? అంటూ సామాన్య జనం, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్నెర్రజేస్తోంది.
నోరు మెదపరేం..!
ఐతే.. ఎన్నికల ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ కూటమి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాట ఇచ్చింది. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ ఉండదని పలు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పుకొచ్చారు. ఐతే ఇప్పుడు ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడం గమనార్హం. ఉక్కు పరిశ్రమ మనుగడపై అనుమానాలు వస్తున్నా.. మూసివేత దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపట్లేదు. కనీసం.. విశాఖ టీడీపీ ఎంపీ శ్రీ భరత్, గాజువాక ఎమ్మెల్యేలు, మరీ ముఖ్యంగా నాడు రాజీనామా చేస్తానని హడావుడి చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా చేజేతులా వదిలేయడం గమనార్హం. అందరూ పార్టీలు, ప్రాంతాలు అని భేదాలకు పోకుండా విశాఖ ఉక్కును కాపాడుకుని ఊపిరిపోస్తారో.. లేదంటే వదిలేస్తారో చూడాలి మరి.