ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి.. ఫలితాలకు ఈసారి గట్టిగానే గ్యాప్ వచ్చింది.! ఇక చూస్కోండి.. రాసుకున్నోళ్లకి రాసుకున్నంత, చెప్పుకున్నోళ్లకి చెప్పుకున్నంతలా పరిస్థితి ఉంది.! ఇక బెట్టింగ్ రాయుళ్ల గురించి అంటారా అబ్బో లెక్కేలేదు.. కాసుకున్నోళ్లకు కాసుకున్నంత! కాయ్ రాజా కాయ్ అంతే!. ఇక సోషల్ మీడియాలో అయితే.. బాబోయ్ ఆ లెక్కలేంటో, సర్వేలేంటో అస్సలు ఊహించడానికి కూడా లేదు. ఇక కుహనా మేథావులు, రాజకీయ విశ్లేషకులు అంటారా.. మీడియా, డిబేట్స్‌లలో వ్యూహకర్తలకు మించి అంచనాలేస్తున్నారు. కచ్చితంగా అధికారంలోకి వస్తున్నాం.. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా ఫలితాలు ఉంటాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ప్రతిపక్షాలు ఒకింత డైలామాలోనే పడ్డాయి.!
మేమేం తక్కువ కాదుగా!
ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలవదు.. గెలిచేది కూటమేనని 100 నుంచి 135 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని ధీమాగా చెబుతున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికాలో, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్‌లో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రష్యాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరందరికంటే ముందుగా నారా లోకేష్ అమెరికాకు వెళ్లి మిత్రులు, కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇక వైసీపీ నేతలు ఏకంగా జగన్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారానికి టైమ్, డేట్, ప్లేస్‌తో సహా కన్ఫామ్ చేస్తుంటే.. అబ్బే తామేం తక్కువ కాదుగా అన్నట్లుగా టీడీపీ, జనసేన పార్టీలకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు ఇంకాస్త అతి చేయడం మొదలుపెట్టాయి. ఇదిగో టీడీపీ, జనసేన తరఫున గెలిచేది వీళ్లేనని.. ఫలానా వ్యక్తులకు కేబినెట్‌లో చోటు దక్కుతుందని కూడా జోస్యం చెప్పడం షురూ చేశాయి.
ఇదిగో లెక్కలివేనట..!
కూటమిలో భాగంగా బీజేపీకి రెండు, జనసేనకు 3 మిగిలినవన్నీ ఇక టీడీపీకే మంత్రి పదవులు అని ఓ చానెల్ తెగ హడావుడి చేస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. అదేదో అంటారు కదా.. బాప్ ఏక్ నంబర్ అయితే బేటా దస్ నంబర్ అన్నట్లుగా ఇక కూటమి కార్యకర్తలు, ఆయా పార్టీల వీరాభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాలను వైరల్ చేస్తూ రచ్చ రచ్చజేస్తున్న పరిస్థితి. ఇప్పుడిదే నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది. ఇందుకు వైసీపీ శ్రేణులు స్పందిస్తూ అబ్బా.. ఆలూ లేదు అనే సామెతను గుర్తుకు చేస్తున్నారు. ఇంకొందరు అయితే కూటమికి కూసాలు ఎప్పుడో ఊడిపోయాయని అధికారికంగా జూన్-04 ప్రకటన ఉంటుందని సెటైర్లు వేస్తున్న పరిస్థితి. చూశారుగా.. ఈ విషయంలో వైసీపీ కూడా ఏం తక్కువ కాదండోయ్.. ఏం జరుగుతుందో చూద్దాం!