ఏపీలో ఎన్నికల ముందు.. పోలింగ్ రోజు.. ఆ తర్వాత ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. టీవీల్లో, న్యూస్ పేపర్లలో.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. మునుపెన్నడూ లేని విధంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరగడం.. మరికొన్ని నియోజకవర్గాల్లో బాంబులు, పెట్రో బాంబులు మారణాయుధాలతో అటు టీడీపీ.. ఇటు వైసీపీ ఎవ్వరూ తగ్గకుండా గంటలు తరబడి దాడులు చేసుకున్న పరిస్థితిని చూశాం. ఇక అసలు విషయానికొస్తే.. దెందలూరు ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. ఆయనతో పాటు 12 మంది అనుచరులు కూడా అడ్రస్ లేరని ఏలూరు జిల్లా నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య ప్రకటించారు.
ఎందుకు.. ఏమైంది..
మే-13న పోలింగ్ రోజున దెందలూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఇది పోలింగ్ బూత్‌నకు సమీపంలోనే జరగడంతో.. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు తాళ్లూరి రాజశేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇతను చింతమనేని మనిషి. దీంతో.. తమ పార్టీకి చెందిన వ్యక్తినే అరెస్ట్ చేస్తారా అంటూ 14 మంది అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పైకి చింతమనేని వెళ్లి.. పోలీసులపై దౌర్జన్యం చేశారు. సినిమాలో లాగే.. పోలీసులు, ఎస్ఐ అందరూ ఉండగానే లాకప్‌లో ఉన్న నిందితుడ్ని బలవంతంగా చింతమనేని తీసుకెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై కన్నెర్రజేసిన పోలీసు ఉన్నతాధికారులు చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.
రాష్ట్రం విడిచి..
ఈ మొత్తం వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ను పోలీసులు పట్టుకోవడం.. కోర్టులో హాజరుపరచడం అయ్యింది కానీ చింతమనేని మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ఏపీని వదిలి ప్రభాకర్ పారిపోయారని.. ఇప్పట్లో తిరిగొచ్చే పరిస్థితి లేదని.. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా శని, ఆదివారాలు సెలవులు కావడంతో బెయిల్ దొరికే అవకాశం లేకపోవడంతో పరారయ్యారని తెలుస్తోంది. యాంటిసిపేటరీ బెయిల్ దొరికిన తర్వాతే అజ్ఞాతం నుంచి చింతమేనని బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడం అంటే మామూలు విషయం కాదని.. నూటికి వెయ్యి శాతం చింతమనేనికి బెయిల్ దొరకడం కష్టమేనని.. కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. చూశారుగా.. చేజేతులారా చింతమేనని ఇరుక్కున్నారు.! ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.