ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. ఫలితాలు కూడా రాకముందే ఎవరి లెక్కల్లో వారున్నారు. కచ్చితంగా గెలిచి తీరుతామని కూటమి.. అబ్బే సీట్లు తగ్గినా అధికారం మాదేనని వైసీపీ ఇలా ఊహల్లో తేలియాడుతున్నారు.! ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒకవేళ కూటమి గెలిస్తే ఏం చేయాలి..? ఎవరెవర్ని కేబినెట్‌లోకి తీసుకోవాలి..? ఏ పార్టీకి ఎన్ని కేబినెట్ పదవులు ఇవ్వాలి..? అని లెక్కలేసుకునే పనిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. గత నాలుగైదు రోజులుగా మంత్రి పదవులు ఆశిస్తున్న బీజేపీ కీలక నేతలు, సీనియర్లు ఒక్కొక్కరుగా బాబుతో భేటీ అవుతూ వస్తున్నారు.
నాడు.. నేడు!
టీడీపీకి ఆర్థికంగా అండగా ఉంటూ వస్తున్న సుజనా చౌదరి కొన్ని కారణాల రీత్యా సైకిల్ దిగేసి కమలం పార్టీలోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ చంద్రబాబుతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూనే వస్తున్నారు. ఢిల్లీలో ఏం పనులు కావాలన్నా టీడీపీ నుంచి వెళ్లిన సుజనా, సీఎం రమేష్ ఇద్దరూ చక్కబెడుతూ వచ్చేవారు. అంతేకాదు.. తన రాజకీయ గురువు చంద్రబాబేనని సుజనా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే.. బాబు మెచ్చారు కాబట్టి 2014లో కూడా కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇప్పించారు. ఇప్పుడు మరోసారి మంత్రి కాబోతున్నారట. కూటమి గెలిస్తే పక్కాగా.. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీ నుంచి పోటీచేసిన వారిలో ఎక్కువగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పోటీచేసిన సుజనాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు కూటమి గెలవడం.. ఇటు మంత్రి పదవి రావడమే ఆలస్యమట. అంటే నాడు కేంద్రంలో.. నేడు రాష్ట్రంలో అంతా చంద్రబాబు హయాంలోనే జరుగబోతోందట.
గెలుస్తున్నాం..!
శనివారం నాడు చంద్రబాబుతో సుజనా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని బాబు నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఎన్నికల పోలింగ్ సరళీ, విజయావకాశాలపై నిశితంగా చర్చించడం జరిగింది. కూటమి గెలుస్తోంది.. మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చంద్రబాబుతో సుజనా ముచ్చటించారు. అంతేకాదు.. తనను కేబినెట్‌లోకి తీసుకునే అంశంపై కూడా చర్చించారని తెలుస్తోంది. ఇందుకు బాబు బదులిస్తూ అన్నీ అనుకున్నట్లు జరిగితే కేబినెట్‌లోకి తీసుకుంటానని మాటిచ్చారట. ఇలా ఒకరు కాదు ఇద్దరూ కాదు.. పదుల సంఖ్యలో ఆశావహులు ముందుగానే కేబినెట్‌లో చోటు కోసం ఖర్చీప్ వేసుకుని కూర్చున్నారట. చూశారుగా.. ఇదీ కూటమిలో పరిస్థితి. ఇక వైసీపీ కూడా ఇందులో ఏ మాత్రం తక్కువేమీ కాదు.. ఇదిగో ఇదే జగన్ కొత్త కేబినెట్ అంటూ ఏకంగా మంత్రుల జాబితానే రిలీజ్ చేసేసింది కూడా. ఫైనల్‌గా జూన్-04న ఏం జరుగుతుందో చూడాలి మరి.