ఎన్నికలు అంటే బెట్టింగ్ రాయుళ్లకు అదొక కిక్కు..! అదీ ఏపీ ఎన్నికలు అయితే అబ్బో ఆ కథే వేరుగా ఉంటుంది.! చిత్ర విచిత్రాలుగా ఈ బెట్టింగ్‌లు ఉంటాయి. రాష్ట్రం మొత్తమ్మీద ఏ పార్టీ గెలుస్తుంది..? ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి..? ఏయే నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు..? మెజార్టీ ఎంత రావచ్చు..? నోటాకు మించి ఫలానా అభ్యర్థికి ఎన్ని ఓట్లు రావచ్చు..? అదిగో ఆ అభ్యర్థి అస్సలు గెలవరు.. మూడో స్థానానికి పరిమితం అవుతారు..? ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లెక్కా పక్కా అంతా బెట్టింగ్ రాయుళ్లకే ఎరుక. అలాంటిది ఇక ఎవరి ధీమాలో వారు.. ఎవరి నమ్మకాల్లో వాళ్లు బెట్టింగ్‌లు కట్టేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఏపీ ఎన్నికలపై సొంత రాష్ట్రం కంటే చుట్టుపక్కలున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల బెట్టింగ్ రాయుళ్లు ఇంట్రెస్ట్ చూపిస్తుండటం గమనార్హం.
ఎవరు రేంజ్ ఏంటి..?
ఇక అసలు విషయానికొస్తే.. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన వైఎస్ షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయి..? అని కొందరు.. అసలు డిపాజిట్లు వస్తాయా..? పోనీ ఎన్నో స్థానానికి పరిమితం కావచ్చు..? అని మరికొందరు కోట్లల్లో బెట్టింగులు కాసిన పరిస్థితి. ఇక రఘురామకృష్ణం రాజు పోటీచేస్తున్న ఉండి నియోజకవర్గంలో గెలుస్తారా లేదా..? ఒకవేళ గెలిస్తే ఎంతవరకు మెజార్టీ రావచ్చు..? ఓడిపోతే ఏ స్థానంలో ఉంటారు..? ఇక స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన శివరామరాజుకు ఎన్ని ఓట్లు రావొచ్చు..? ఇలా ఏపీలో కోట్లల్లో బెట్టింగులు జరుగుతున్న పరిస్థితి. పందేలు అనేది చట్ట విరుద్ధం అయినప్పటికీ జోరుగానే నడుస్తున్నాయి. ఇక మంగళగిరి నుంచి పోటీచేస్తున్న నారా లోకేష్‌పై అయితే.. ఆయన కచ్చితంగా ఓడిపోతారనే దానిపైనే వేల కోట్లల్లో బెట్టింగులు జరుగుతుండటం గమనార్హం.
ఐపీఎల్‌ను మించి!
మొత్తంగా చూస్తే.. ఏపీలో కాయ్ రాజా కాయ్ అని గట్టిగా నడుస్తోందన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఐపీఎల్ బెట్టింగులను మించిపోయి పందేలు నడుస్తున్నాయ్. మరీ ముఖ్యంగా పోతే లక్ష.. వస్తే 5 లక్షలు అని బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. విశ్వసనీయ వర్గాల మేరకు.. ఏపీలో ఇప్పటి వరకూ 20 వేల కోట్ల బెట్టింగులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక వైసీపీనా.. కూటమి గెలుస్తుందా అని మాత్రం భారీగానే పందేలు జరుగుతున్నాయి. ఇక పిఠాపురం విషయానికొస్తే.. ఇక్కడ రూ. 500 కోట్ల బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కుప్పంలో చంద్రబాబు గెలుపు ఓటములపైనా గట్టిగానే బెట్టింగులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే టీడీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు కొందరు.. వైసీపీనే గెలుస్తుందని కోట్లలో బెట్టింగ్‌లు కాయడం గమనార్హం. ఆ అభ్యర్థులు ఎవరనేది ఇక్కడ అప్రస్తుతం. చూశారుగా.. ఇదీ ఏపీ ఎన్నికలపై నడుస్తున్న బెట్టింగ్!.