టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఏమైంది..? సడన్‌గా బాబు అమెరికా ఎందుకెళ్లారు..? వారం రోజుల పాటు అమెరికాలో ఏం చేయబోతున్నారు..? ఇప్పుడిదే తెలుగుదేశం శ్రేణులు, వీరాభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత పార్టీల అధిపతులంతా ఒక్కొక్కరుగా విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్లగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రష్యా.. ఇప్పుడు బాబు అమెరికా వెళ్లారు. అంతా ఓకేగానీ.. చంద్రబాబు వైద్య పరీక్షల కోసం ఇండియా నుంచి అమెరికా వెళ్లారన్న వార్తలతో తెలుగు తమ్ముళ్లు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకింతలా బాబు ఆరోగ్యంపై దాపరికాలు అంటే పార్టీ నేతలపై క్యాడర్ కన్నెర్రజేస్తోంది.
ఎందుకు.. ఏమైంది..?
చంద్రబాబు దంపతులు వారం రోజులపాటు విదేశాల్లో పర్యటించబోతున్నారు. శనివారం బయల్దేరి వెళ్లిన చంద్రబాబు, నారా భువనేశ్వరి 25న తిరిగి ఇండియాకు చేరుకుంటారని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా బాబు వైద్య పరీక్షలు చేయించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో బాబుకు ఏమైంది..? అంత అనారోగ్యమా..? బయటికి చెప్పలేని.. చెప్పుకోలేనంత పరిస్థితి ఏముంది..? అంటూ కొందరు వీరాభిమానులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి వయసు రీత్యా ఏడాదికి.. రెండేళ్లకోసారి బాబు వైద్య పరీక్షలు చేయించుకుంటూనే ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గతేడాది కూడా అమెరికాలోనే ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు కూడా జనరల్ చెకప్ కోసమే అమెరికా వెళ్లారని ఓ వైపు టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. వైద్య పరీక్షలకు ఇండియాలో ఎక్కడా ఆస్పత్రులు లేవా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి.
లోకేష్ అక్కడే!
ఇదిలా ఉంటే.. ఈనెల 16నే టీడీపీ యువనేత నారా లోకేష్ కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు కూడా కుమారుడితో కలిసి అమెరికాలోనే ఉన్నారు. కాగా.. లండన్ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్‌పై ఎలాంటి చిత్ర విచిత్రాల వార్తలు వస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జూన్-01న అంటే.. ఎన్నికల ఫలితాల మూడ్రోజుల ముందు ఇండియాలో జగన్ అడుగుపెట్టబోతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ అనుకూలంగా ఉన్న టీవీ చానెల్స్, దినపత్రికలు.. యూ ట్యూబ్ చానెళ్లలో అయితే బాబోయ్.. ఆ వార్తలకు హద్దూ పద్దూ లేకుండా పోయింది. ఇప్పుడిక చంద్రబాబుపై వైసీపీ అనుకూల మీడియాలో ఓ రేంజిలో కథనాలు ప్రసారం చేస్తున్నారు. చూశారుగా.. ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు నెలలుగా ఎన్నికల రణరంగంలో అలిసిపోయి.. అలా కాస్త చిల్ అయ్యి వస్తే ఈ మీడియాకు వచ్చిన ఇబ్బందులేంటో..? ఎందుకింతలా పైత్యం ప్రదర్శిస్తున్నారో వారి విజ్ఞతకే వదిలేయాల్సిన పరిస్థితి.