ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కేవలం 48 గంటలు మాత్రమే పోలింగ్ గడువు ఉండగా.. ఓటర్లను అభ్యర్థించడానికి మాత్రం 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో చివరి అస్త్రశస్త్రాలు ఏమైనా ఉంటే ఓటర్లపై ప్రయోగించడానికి పార్టీలు బయటికి తీస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాల సంగతి అటుంచితే.. కీలకమైన స్థానం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురంలో ఏం జరుగుతోంది..? అక్కడ వైసీపీ ఓటుకు ఎంత రేటు కడుతోంది..? జనసేన ఓటుకు ఎంతిస్తోంది..? ఎందుకింతలా పిఠాపురంపై ఇరు పార్టీలు ఫోకస్ పెట్టాయి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి!
బాబోయ్ గట్టిగానే..!
హైదరాబాద్ నుంచి లక్షల మంది ఓటర్లు ఏపీకి తరలివెళ్లారు.. ఇంకా వెళ్తున్నారు కూడా. అయితే ఈసారి ఎన్నికలు అటు వైసీపీకి.. ఇటు కూటమికి చావోరేవో అన్నట్లుగా ఉండటంతో బస్సులు పెడుతున్నాం ఇదిగో ఈ నంబర్లకు కాల్ చేస్తే చాలు మీకు కావాల్సిన చోటికి వచ్చి తీసుకెళ్తాం అని నెట్టింట్లో రెండు పార్టీలు గట్టిగానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది ఎంతవరకు నిజమని కాల్ చేసి మాట్లాడగా వాస్తవమేనని తేలింది కూడా. ఇక అసలు విషయానికొచ్చేస్తే.. పిఠాపురం వాస్తవ్యులు, మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిని నియోజకవర్గంలో ఏం జరుగుతోంది..? ఏ పార్టీ వాళ్లు ఎంతిస్తున్నారు..? అని క్లియర్ కట్‌గా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు విని అవాక్కయిన పరిస్థితి. వైసీపీ ఓటుకు అక్షరాలా 5వేల రూపాయిలు ఇస్తోంది.. ఇక జనసేన మాత్రం కేవలం 1500 రూపాయిలు ఇస్తోందని చెప్పారు. కచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకే ఓటేస్తారన్న వారికి మాత్రం ఇంకో ఐదు వందల రూపాయిలు ఎక్కువే ఇస్తున్నారు. ఇదబ్బా పిఠాపురంలో పరిస్థితి.
ఏం జరుగుతుందో..?
ఇక్కడ్నుంచి పోటీచేస్తున్న ఇద్దరేమీ ఆషామాషీ మనుషులేం కాదు.. ఒకరు రాజకీయాల్లో పండిపోయిన నేత కావడం.. ఇంకొకరు పార్టీకి అధినేతగా ఉన్నారు. పైగా రెండు చోట్ల ఓడిపోయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే.. అని పట్టుదలతో ఉన్నారు పవన్ కల్యాణ్. ఇక కార్యకర్తగా మొదలుపెట్టిన వంగా గీత రాజకీయ జీవితం ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు కూడా వెళ్లొచ్చారు. ఇక వైసీపీ ఉద్దండులందర్నీ తెప్పించుకొని ప్రచారం చేయడం.. పవన్ కూడా బుల్లి తెర, వెండితెర నటీనటులంతా నియోజకవర్గంలో వాలిపోయేలా చేశారు. ఇవన్నీ ఏ మాత్రం ఎవరికి ప్లస్.. ఇంకెవరికి మైనస్ అవుతాయో తెలియట్లేదు కానీ.. ఓటుకు రేటెంత కడుతున్నారో చూశారుగా..! ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసైనా సరే.. ఓటుకు ఎంతిచ్చి అయినా సరే గెలిచి తీరాల్సిందేనన్నది వైసీపీ ఉన్నది. ఇక సామాజిక వర్గం, గతంలో ఓడిపోయిన సింపతీ, నటీనటుల ప్రచారం, మెగా ఫ్యామిలీ, టీడీపీ నేత వర్మ ఉండటం కలిసొస్తుందనే ధీమాలో పవన్ ఉన్నారు.. మరి ఫైనల్‌గా విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి మరి.