ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడిగా తొలిసారి చిలకలూరిపేట వేదికగా ప్రజాగళం భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. చరిత్రలో నిలిచిపోవాలని.. ప్రతిష్ట్తాత్మకంగా తీసుకుని సుమారు 300 ఎకరాల్లో సభను నిర్వహించి.. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా విచ్చేయగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనుకున్నట్లుగానే సభకు భారీగా జనసమీకరణ జరిగినప్పటికీ.. మోదీ కాస్త అసహనానికి లోనైనట్లుగా తెలుస్తోంది. సభా వేదికపైగి ప్రధాని వచ్చింది మొదలుకుని ప్రసంగం ముగిసేవరకూ ఆయన్ను కాస్త నిశితంగా గమనిస్తే ఈ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతుంది.
ఏం జరిగింది..?
ప్రజా గళం సభలో నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. మోదీ ప్రసంగిస్తుండగా ఒకసారి కాదు నాలుగైదు సార్లు మైక్ కట్ అయ్యింది. దీంతో ఏ.. క్యా.. హై అన్నట్లుగా చూసి ఊరుకున్నారు. ఇక లక్షలాదిగా వచ్చిన జనాల కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌లు సరిగ్గా రాకపోవడంతో సభికులు సైతం అసహనానికి గురయ్యారు. మరీ ముఖ్యంగా టీవీల్లో, యూట్యూబుల్లో లైవ్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అసలు అక్కడేం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇదే సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు, వీరాభిమానులు ఎలక్ట్రిక్ పోల్స్‌ను ఎక్కడం అందర్నీ ఆందోళనకు గురిచేసిన విషయం. ఏంటిది.. పోల్‌లు దిగండి అని స్వయంగా ప్రధాని చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితి. మోదీ చెబితే గానీ.. సభా నిర్వహకులకు తెలియకపోవడం గమనార్హం. కనీసం తాగునీరు కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదని.. సభకు వెళ్లొచ్చిన జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక పార్కింగ్ విషయంలో, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య ప్రజలు, పార్టీల కార్యకర్తలు సైతం ఇబ్బంది పడ్డారు. ఈ పరిణామాలన్నింటిపై మోదీ ఒకింత అసహనానికి లోనయ్యారట.
ఏంటిది.. ఇదేం సభ!
ఇంత పెద్ద సభ పెట్టి.. కనీసం మైక్‌లు సరిగ్గా లేకపోవడం ఏంటనేది బీజేపీ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న. ఇది పనిగట్టుకుని చేశారని.. మోదీని అవమానించారని బీజేపీ కార్యకర్తలు కొందరు నెట్టింట్లో చర్చించుకుంటున్న పరిస్థితి. సభలో ప్రధాని హైలైట్ కావొద్దనే ఇలా చేశారనే ఆరోపణలూ కోకొల్లలు. మరోవైపు అధికార వైసీపీ కూడా ఇదే విషయాలను లేవనెత్తింది. ఏపీకి పిలిచి మరీ మోదీని అవమానించారని.. అయినా ఇలా చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నట్లుగా ఆరోపణలు చేసింది. చూశారుగా.. ప్రధాని వచ్చిన ఇన్ని లోపాలా..? అని సామాన్యుల నుంచి కార్యకర్తలు, అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రశ్నలు. సెంట్రల్ ఫోర్స్ వచ్చింది కాబట్టి భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా అన్నీ సవ్యంగా సాగాయని లేకుంటే పరిస్థితులు ఎలా ఉండేవో అని ఒకింత బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందారట. అయితే ఇదంతా జగన్ సర్కార్ చేసిన కుట్రేనని.. కరెంట్ ఆపించడం, పదేపదే ఇబ్బందులకు గురిచేశారనే టాక్ కూడా నడుస్తోంది. ఏదేమైనా ప్రధాని వచ్చారని కాదు కానీ.. ఇంత ప్రతిష్టాత్మక సభకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.